స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాల్లో ముగిశాయి. భారతీయ ఈక్విటీ సూచీలు అన్ని రంగాల్లో అమ్మకాల కారణంగా వరుసగా ఐదో సెషన్‌లో నష్టపోయాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించిన తరువాత.. పెట్టుబడిదారులు జాగ్రత్త పడ్డారు. ఉదయం సెన్సెక్స్ 56,438.64 పాయింట్ల వద్ద ప్రతికూలంగా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 57,505.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని 56,394.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 382.91 (0.66 శాతం) పాయింట్ల నష్టంతో 57,300.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 16,847.95 వద్ద నష్టాలతో ఓపెన్ అయ్యింది. ఇంట్రాడేలో 17,148.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,843.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 114.45 (0.67 శాతం) పాయింట్లు నష్టపోయి.. 17,092.20 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.74.83 వద్ద నిలిచింది.
టాటా స్టీల్ 4 శాతం నష్టం..
నిఫ్టీ మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ 1.02 శాతం పతనమైంది. స్మాల్ క్యాప్ షేర్లు 2.05 శాతం క్షీణించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల్లోకి సైన్యాన్ని పంపించాలని ఆదేశించడంతో మార్కెట్లపై ఒత్తిడి పెంచిందని నిపుణులు తెలిపారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలోని మొత్తం 15 రంగాల స్టాక్‌లు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ 1.48 శాతం, నిఫ్టీ మెటల్ 1.11 శాతం నష్టపోయాయి. ఫలితంగా ఇండెక్స్ చాలా బలహీనపడింది. టాటా స్టీల్ 4.05 శాతం నష్టపోయింది. బీపీసీఎల్, ఎస్‌బీఐ లైఫ్, టాటా మోటార్స్ కూడా నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరో మోటోకార్ప్, ఐషర్ మోటార్స్, హిందాల్కో లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ-30 ప్లాట్‌ఫామ్‌లో టాటా స్టీల్, టీసీఎస్, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐటీసీలు తమ షేర్లు 3.64 శాతం వరకు పడిపోయాయి.
రష్యా ప్రకటనతో నష్టాల్లోకి..
రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పుతిన్ చేసిన ప్రకటన.. మంగళవారం మార్కెట్లను మరింత నష్టాల్లోకి జారేలా చేసింది. ఉక్రెయిన్, అమెరికా సహా నాటో కూటమిలోని పలు దేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. రష్యాపై ఆంక్షలకు వెనుకాడబోమని ఐరోపా సమాఖ్య హెచ్చరించడం మార్కెట్ మరింత పతనానికి కారణమైంది. రష్యా గుర్తించిన స్వతంత్ర ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టపోయాయి. ముడి చమురు ధరలు 100 డాలర్లకు చేరుకున్నాయి.
భారీగా నష్టపోయిన టెలికాం..
ఇన్‌ట్రాడే కనిష్టాల నుంచి సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు పుంజుకుంది. ఈ రికవరీలో మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్ కీలక పాత్ర పోషించాయి. విద్యుత్, యుటిలిటీస్ సూచీలు మాత్రమే స్వల్ప లాభాల్లో ముగిశాయి. టెలికాం, ఇండస్ట్రీస్, పీఎస్‌యూ, మెటల్, బేసిక్ మెటీరియల్స్, టెక్ రంగాల షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 50లో 17 షేర్లు లాభపడగా.. 33 షేర్లు నష్టపోయాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..