ఉమ్మడిరంగారెడ్డి, ప్రభన్యూస్ : తాండూరు రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం..ఇక్కడి వ్యాపారాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ నియోజకవర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి…తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిల మధ్య వార్ కొనసాగుతోంది…వీరిద్దరూ ఒకే పార్టీలో కొనసాగుతున్నా ఉత్తర…దక్షిణ దృవాలుగా కొనసాగుతున్నారు…ప్రతిరోజూ ఈ ఇద్దరు నేతలు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూనే ఉంటారు…ఇది అధికారులకు తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే కార్యక్రమానికి హాజరైతే ఎమ్మెల్సీ వర్గానికి కోపం వస్తుంది….ఎమ్మెల్సీ కార్యక్రమానికి హాజరైతే ఎమ్మెల్యే వర్గానికి కోపం వస్తుంది…ప్రస్తుతం అధికారుల పరిస్థితిఎలా ఉందంటే ముందు నుయ్యి….వెనక గొయ్యిగా మారింది…ఎన్నికలకు ఇంకా టైమున్నా టికెట్టు నాదంటే నాదని వాదులాడుకుంటున్నారు….నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది….పార్టీ పెద్దలు జోక్యం చేసుకోని పక్షంలో పార్టీకి తీరని అన్యాయం జరిగే ప్రమాదం లేకపోలేదు…..
తాండూరు నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలో కీలక నియోజకవర్గం. వ్యాపార కేంద్రంగా పేరుంది. ఈ ప్రాంతం చుట్టూరా ప్రాంతాలకు కేంద్రంగా కొనసాగుతోంది. ఈనియోజకవర్గంలో పని చేసేందుకు గతంలో అధికారులు ఉత్సాహం చూపేవాళ్లు. కానీ ప్రస్తుతం మాత్రం ఇక్కడికి ఎందుకొచ్చామని తలలు పట్టుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో అధికార…ప్రతిపక్ష పార్టీల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కానీ తాండూరు నియోజకవర్గంలో అధికార పక్షంలోనే గొడవలు జరుగుతున్నాయి. దీంతో పార్టీ కూడా రెండుగా చీలిపోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వివాదం కొనసాగుతోంది. ఎమ్మెల్యే…ఎమ్మెల్సీ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రతి కార్యక్రమంలో రెండు వర్గాల మధ్య గొడవలు జరగడం పరిపాటిగా మారింది. నియోజకవర్గంలో పని చేసేందుకు గతంలో ఉత్సాహం చూపే అధికారులు నేడు ఎందుకు వచ్చామని తలలు పట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ముందు నుయ్యి…వెనక గొయ్యి మాదిరిగా తయారైంది పరిస్థితి. ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తే ఎమ్మెల్సీకి కోపం వస్తుంది…ఎమ్మెల్సీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఎమ్మెల్యేకు కోపం వస్తుంది. ఇద్దరిని సమన్వయం చేసుకోవడం అధికారులకు తలనొప్పిగా మారింది.
రెండుగా చీలిపోయిన పార్టీ….
క్రమ శిక్షణకు మారుపేరుగా నిలిచే తెరాస తాండూరులో మాత్రం క్రమ శిక్షణ తప్పుతోంది. వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుండటంతో పార్టీ రెండుగా చీలిపోయింది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గం….ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గాలుగా విడిపోయారు. తెరాసకు చెందిన మెజార్టీ నేతలు మహేందర్‌రెడ్డి వెంట ఉండగా కాంగ్రెస్‌నుండి తనతోపాటు వచ్చిన క్యాడర్ రోహిత్‌రెడ్డి వెంట ఉన్నారు. తాండూరు నియోజకవర్గంలో తెరాస పటిష్టంగా ఉంది. 2018 ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా రంగంలో దిగిన మహేందర్‌రెడ్డి ఓడిపోగా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన రోహిత్‌రెడ్డి
ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఏడాది లోపే ఆయన తెరాస తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల మినహా మెజార్టీ స్థానాలు అధికార తెరాస విజయం సాధించింది. చాలారోజులుగా రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. దీంతో పార్టీ నేతలు, కార్యకర్తలు రెండుగా చీలిపోయారు. రెండు వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్లు పరిస్థితులు మారాయి.
తాండూరు నాదేనంటున్న మహేంద్రుడు….
తాను పుట్టి పెరిగింది చేవెళ్ల నియోజకవర్గం షాబాద్‌లో అయినప్పటికీ తనకు రాజకీయ బిక్ష పెట్టింది మాత్రం తాండూరు నియోజకవర్గమే. దానిని ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని మహేందర్‌రెడ్డి గట్టి ధీమాతో ఉన్నారు. 1994 ఎన్నికల్లో తొలిసారి తాండూరు అసెంబ్లి నుండి తెదేపా అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రెస్ కోటను బద్దలు కొట్టారు. 1999లో కూడా రెండవసారి తాండూరు నుండే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో మాత్రం నారాయణరావు (కాంగ్రెస్) చేతిలో ఓటమిపాలయ్యారు. 2009ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి తెదేపా అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో తెరాస అభ్యర్థిగా బరిలో దిగి నాల్గవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి తరపున ఏకైక మంత్రిగా కొనసాగారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ వెంటనే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహేందర్‌రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. డిసెంబర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో తనకే తాండూరు టికెట్టు వస్తుందనే ధీమాతో ఉన్నారు. పార్టీలో సీనియర్‌గా కొనసాగుతున్నందునా తనకే అవకాశం వస్తుందనే గట్టి నమ్మకం మహేందర్‌రెడ్డిలో ఉంది. మహేందర్‌రెడ్డి వర్గం కూడా అదే ధీమాతో ఉంది. తాండూరులో మహేందర్‌రెడ్డి పక్కాగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టికెట్టుు విషయంలో ఇంకా సమయమున్నందునా ఎవరికి వస్తుందో చెప్పని పరిస్థితులు నెలకొన్నాయి….
మాటిచ్చారు వచ్చే ఎన్నికల్లో బరిలో నేనే.అంటున్న పైలెట్…..
వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో తాండూరు టికెట్టు తనకే వస్తుందనే గట్టి నమ్మకంతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఉన్నారు. పార్టీలో చేరిన సమయంలో వచ్చే ఎన్నికల్లో టికెట్టు ఇస్తామని హామి ఇచ్చినందునా వచ్చే సారి తానే పోటీ చేస్తానని పక్కా ధీమాతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పైలెట్ తెరాసకు పెద్ద దిక్కుగా ఉన్నారు. మహేందర్‌రెడ్డి పార్టీలో చేరిన తరువాత పైలెట్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2018 ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఏడాది లోపే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌నుండి ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన వారంతా తెరాసలో చేరిపోయారు. పైలెట్ కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో యువ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్టు పక్కా అని ఆయన తేల్చి చెబుతున్నారు. తన వర్గీయులు కూడా అదే ధీమాతో ఉన్నారు. పార్టీ పెద్దలు పలు సందర్భాల్లో సిట్టింగ్‌లకే టికెట్టు ఇస్తామని ప్రకటనలు చేస్తుండటంతో తనకే టికెట్టు ఇస్తారని రోహిత్‌రెడ్డి తేల్చి చెబుతున్నారు….
తాత్కాలిక రాజీలతోనే సరి….
మహేందర్‌రెడ్డి…రోహిత్‌రెడ్డిల మధ్య చాలాకాలంగా గొడవలు జరుగుతున్నా పార్టీ పెద్దలు తాత్కాలిక రాజీలు కుదుర్చుతున్నారు తప్పిస్తే శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. గొడవలు జరినప్పుడు పిలిచి మాట్లాడటం సర్ది చెప్పడం పరిపాటిగా మారింది. వివాదం జరిగినప్పుడు గొడవ పెద్దది అయినప్పుడు ఇద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇద్దరికి సర్ది చెప్పి మళ్లి గొడవ పడకూడదని చెప్పి పంపిస్తున్నారు. కొన్ని రోజుల తరువాత షరా మామూలే అనే విధంగా పరిస్థితులు మారిపోతున్నాయి….
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..