Friday, November 22, 2024

భార‌త్, పాక్ మ‌ధ్య యుద్ధం..! నేడు మ‌రో హై వోల్టేజ్ మ్యాచ్‌..!

ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. పేరుకు జెంటిల్మెన్ గేమ్ అయినా ఇండియా పాక్ మ్యాచ్ అంటే అదో యుద్ధంలా సాగుతోంది. నువ్వా నేనా అన్నట్లుగా రెండు జట్లు తలపడతాయి. ఇది చూడ్డానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులంతా టీవీలకు అతుక్కుపోతారు. ఇప్పుడు అలాంటి హై వోల్టేజ్ గేమ్ రెడీ అయిపోయింది. ఆసియా కప్ సూపర్‌–4 రౌండ్‌ లో భాగంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కు సర్వం సిద్ధం అయిపోయింది. భారత్ పాక్ మ్యాచ్ అంటే నరాలు తెగే ఉత్కంఠ. గేమ్ లో బంతి బంతికి మారే ఆధిపత్యం. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం. బ్లాక్ బాస్టర్ వార్ చూసేందుకు క్రికెట్ ఫ్యాన్స్ వెయిటింగ్. జెంటిల్మెన్ గేమ్ ను పూర్తి స్థాయిలో ఆస్వాదించాలంటే ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను చూడాలి. క్రికెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈ మ్యాచ్ ను చూస్తే వెర్రెక్కి పోతారు. అందుకే ఎప్పుడూ వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, ఆసియా కప్ లో ఎన్ని మ్యాచ్లు పోటాపోటీగా జరిగిన ఇండియా పాక్ మధ్య జరిగే మ్యాచ్ చూస్తేనే మజా వస్తుంది. ఇప్పుడు అలాంటి కిక్కిచ్చే గేమ్ కు అంతా రెడీ అయింది. ఆసియా కప్ సూపర్‌–4 రౌండ్‌ లో భాగంగా ఈ రోజు రాత్రి ఇరు జట్లూ తలపడనున్నాయి. గ్రూప్-ఏ లో భాగంగా గత వారం జరిగిన తొలి పోరులో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని రోహిత్‌సేన భావిస్తుంటే.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్‌ కసిగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య మరోసారి ఉత్కంఠ పోరు నడిచే అవకాశం కనిపిస్తోంది. ఆసియా కప్ లో వరుసగా రెండు విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు ఈ మ్యాచ్ లో కఠిన సవాల్ ఎదురవనుంది. గాయం వల్ల స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా జట్టుకు దూరం అవగా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ ఇద్దరితో పాటు విరాట్‌ కోహ్లీ పవర్‌ ప్లేలో నిదానంగా ఆడటంతో జట్టుకు మంచి ఆరంభం దక్కడం లేదు. పాక్‌పై కేఎల్‌ రాహుల్‌ డకౌట్‌ అవ్వగా.. రోహిత్‌, కోహ్లీ కూడా ఇబ్బంది పడ్డారు. దాంతో, చిన్న లక్ష్య ఛేదనలో భారత్ చివరి ఓవర్‌ వరకూ వేచి చూడాల్సి వచ్చింది. జడేజాతో హార్దిక్‌ పాండ్యా వీరోచిత పోరాటంతో జట్టు గెలిచింది. ఇప్పుడు జడేజా టీమ్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్లు తొలి ఓవర్‌ నుంచే బ్యాట్‌ ఝుళిపించాల్సి ఉంది.

హాంకాంగ్‌పై అర్ధ సెంచరీతో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభసూచకం. కానీ, అతను వేగంగా ఆడాల్సిన అవసరం ఉంది. గాయపడ్డ జడేజా స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అవేశ్‌ ఖాన్‌ అనారోగ్యంతో బాధ పడుతున్నాడని కోచ్ ద్రవిడ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో అతడిని తప్పించి అదనపు బ్యాటర్ లేదా స్పిన్నర్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు తొలి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓటమి నుంచి తేరుకున్న పాకిస్థాన్ గత పోరులో హాంకాంగ్‌ పై 155 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంది. ఓపెనర్‌ రిజ్వాన్‌ ఫామ్‌ కొనసాగించగా.. ఫఖర్‌ జమాన్‌, కుష్దిల్‌ షా కూడా ఫామ్ లోకి రావడంతో టీమ్‌ బ్యాటింగ్‌ బలం పెరిగింది. ఈ పోరులో తొలి పది ఓవర్లలో ఎక్కువ రన్స్‌ చేయడంపై ఫోకస్‌ పెట్టింది. ఇక, బౌలింగ్‌లో ఆ జట్టుకు తిరుగులేదు. స్టార్‌ పేసర్ షాహీన్‌ ఆఫ్రిది ప్లేస్‌లో వచ్చిన 19 ఏళ్ల నసీమ్‌ షా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతని నుంచి భారత బ్యాటర్లకు మరోసారి ముప్పు తప్పకపోవచ్చు. స్పిన్నర్లు మొహమ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ కూడా సత్తా చాటుతున్న నేపథ్యంలో భారత్ ఏచిన్న తప్పిదం చేసినా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement