Tuesday, November 26, 2024

గాంధీ మార్గంలో నడవండి, వీడ్కోలు సభలో ఎంపీల‌తో రాష్ట్ర‌ప‌తి కోవింద్‌

పార్లమెంటు సభ్యులు అన్నివేళలా గాంధీ సిద్ధాంతాలను తుచ తప్పకుండా పాటించాలని పదవీ విరమణ చేయనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు. పార్లమెంటులో చర్చల సందర్భంగాను, అసమ్మతిని వ్యక్తం చేసే సందర్భాల్లోనూ సదా గాంధీ సిద్దాంతాలే ఆచరణీయమని, సభ్యులు మనసా వాచా కర్మణా వాటిని పాటించాలని కోవింద్‌ ఉద్బోధించారు. శాంతి సామరస్యాలు ప్రధానమన్నారు. వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉంటుందని, వారి లక్ష్యాలు సాధించుకునేందుకు ఒత్తిడి చేయడం కూడా సహజమేనని, అయితే ఏది చేసినా గాంధీ అడుగుజాడల్లోనే ఆయన సిద్దాంతాల పరిధిలోనే జరగాలని కోవింద్‌ హితవు చెప్పారు. రాష్ట్రపతిగా ఈ దేశానికి అయిదేళ్లు సేవచేసే భాగ్యం ప్రసాదించిన దేశపౌరులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం అని ఆయన అభివర్ణించారు. పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో కోవింద్‌కు వీడ్కోలు కార్యక్రమం జరిగింది.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో పాటు కేంద్ర మంత్రులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని తాను మనసారా అభినందిస్తున్నట్టు కోవింద్‌ చెప్పారు. ఆమె నేతృత్వంలో భారతదేశం అన్నివిధాలా లబ్ధి పొందగలదని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్టు కోవింద్‌ వెల్లడించారు. స్వార్థ రాజకీయాలు వదిలి జాతీయ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు పనిచేయాలని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు చేయాలని ఆయన పిలుపిచ్చారు. పార్లమెంటు సభ్యుల మధ్య తానొక పెద్ద కుటుంబంలో ఉన్నానన్న భావన నా మనస్సులో పాదుకుపోయి ఉందని రాష్ట్రపతి చెప్పారు. వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యుల మధ్య కుటుంబాల్లో ఉన్నట్టే విభేదాలు ఉండొచ్చని,అయితే దేశ విశాల ప్రయోజనాల రీత్యా అందరూ కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement