న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణలో గురువారం ఆద్యంతం ఉత్కంఠ కొససాగింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో గురువారం విచారణకు కావాల్సిన కవిత, చివరి నిమిషంలో తన తరఫున న్యాయవాది సోమ భరత్‌ను ఈడీ కార్యాలయానికి పంపించి విచారణకు హాజరుకావడం లేదంటూ వర్తమానం పంపారు. ఈ మేరకు ఆమె ఈడీ అసిస్టెండ్ డైరక్టర్ జోగిందర్‌కు లేఖ రాసిన కవిత, ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈడీ సమన్లు, విచారణ తీరు సహా మహిళను విచారణకు పిలవడంపై తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని, ఆ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మార్చి 24న విచారణ జరపనుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈడీ విచారణ జరపడం సమ్మతం కాదని కవిత అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు హాజరుకావాలంటూ తనకు మార్చి 7న పంపిన నోటీసులకు బదులిస్తూ.. ఓ మహిళగా, ప్రజా ప్రతినిధిగా తనను తన నివాసంలోనే విచారణ జరపాలని కోరానని, విచారణలో భాగంగా మరొకరితో కలిపి కన్‌ఫ్రంటేషన్ పద్ధతిలో ప్రశ్నించాల్సి ఉంటే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తానని చెప్పానని ఆమె గుర్తుచేశారు.
విచారణకు సహకరించేందుకు తాను మొదటి నుంచి సిద్ధంగా ఉన్నానని, కానీ కన్‌ఫ్రంటేషన్ విధానాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం సాధ్యం కాదని, ఎదురుబొదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించాల్సి ఉంటుందని ఈడీ చెప్పిందని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ దశలో తాను ఈ నెల 11న విచారణకు హాజరై పూర్తిగా సహకరించినప్పటికీ ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 50(5) ప్రకారం తన ఫోన్ జప్తు చేసుకున్నారని లేలో పేర్కొన్నారు. అంతేకాదు, ఆ రోజు చీకటిపడ్డ తర్వాత కూడా రాత్రి గం. 8.30 వరకు ఈడీ ఆఫీసులోనే ఉంచి, ఆ తర్వాత విడిచిపెట్టారని తెలిపారు. తదుపరి మరోసారి మార్చి 16న (గురువారం) విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసినందున, తాను తన బదులుగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్‌ను తన ప్రతినిధిగా నియమించి పంపిస్తున్నానని కవిత తన లేఖలో పేర్కొన్నారు.
కన్‌ఫ్రంటేషన్ జరగనే లేదు
మార్చి 11న విచారణ జరిపిన ఈడీ అధికారులు ఆ రోజు ఎలాంటి కన్‌ఫ్రంటేషన్ నిర్వహించలేదని కవిత తన లేఖలో పేర్కొన్నారు. విచారణను వారం రోజులు వాయిదా వేయాలని కోరినప్పుడు అరెస్టయిన వ్యక్తిగా ప్రత్యక్షంగా కన్‌ఫ్రంటేషన్ జరపాలన్నదే కారణంగా చూపుతూ వాయిదాను నిరాకరించిన ఈడీ అధికారులు, తీరా తాను విచారణకు హాజరైన రోజు ఆ విధానాన్ని అసలు అనుసరించలేదని అన్నారు. ఇదేంటని విచారణ అధికారుల్లో ఒకరైన భానుప్రియ మీనను ప్రశ్నిస్తే, తమ వ్యూహాలు మారుతుంటాయని బదులిచ్చారని కవిత లేఖలో గుర్తుచేశారు. దీంతో ఈ విచారణ స్వేచ్ఛగా, నిజాయితీగా జరగడం లేదని అర్థమైందని, ఇలాంటి పరిస్థితుల్లో తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని భావించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం తాను సుప్రీంకోర్టు తలుపు తట్టానని చెప్పారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రస్తావించిన కొన్ని అంశాలను ఈడీకి రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు.
సుప్రీం ఆదేశాలిచ్చే వరకు విచారణ వద్దు
తాను దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని, అప్పటి వరకు సమన్లపై తదుపరి చర్యలు, విచారణ జరపడం సరికాదని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. అలాగే ఈడీ కార్యాలయానికి మహిళను పిలవడం చట్టబద్ధం కాదన్న అంశంపై కూడా సుప్రీంకోర్టు విచారణ జరపాల్సి ఉందని తెలిపారు. చట్టసభ సభ్యురాలిగా, చట్టాలు చేసే స్థితిలో ఉన్న తన సొంత హక్కులే ఉల్లంఘనకు గురైనప్పుడు, చట్టంలో పొందుపర్చిన అన్ని అవకాశాలను తాను వినియోగించుకుంటానని లేఖలో కవిత స్పష్టం చేశారు. చివరగా సుప్రీంకోర్టులో తన పిటిషన్‌పై విచారణను కారణంగా చూపుతూ ఈడీ విచారణ వాయిదా వేయాలంటూ అభ్యర్థించారు. కనీసం కోర్టు ఆదేశాలు వెలువడే వరకు విచారణ వాయిదా వేయాలని కోరారు. ఈలోగా ఈడీ అధికారులు అడిగిన తన వ్యక్తిగత, వ్యాపార బ్యాంకు లావాదేవీలు, బ్యాంకు స్టేట్మెంట్లను తన ప్రతినిధి సోమ భరత్ కుమార్ ద్వారా పంపిస్తున్నానని తెలియజేశారు. ఈడీ నిర్ణయాన్ని తన ఈమెయిల్ కు తెలియజేయాలని లేఖలో పేర్కొన్నారు.
ఉదయం నుంచి హైడ్రామా
గురువారం ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఢిల్లీ నివాసం 23 తుగ్లక్ రోడ్ వద్ద ఉదయం నుంచి హైడ్రామా చోటుచేసుకుంది. బుధవారమే ఢిల్లీ చేరుకున్న కవిత తన తండ్రికి కేటాయించిన నివాసంలోనే బస చేశారు. ఇదివరకటిలా అక్కడి నుంచే గురువారం ఈడీ కార్యాలయానికి బయల్దేరుతారని అందరూ అనుకున్నారు. బయల్దేరే ముందు ఉదయం గం. 10.00 సమయంలో కవిత మీడియాతో మాట్లాడతారని కూడా ఆమె వ్యక్తిగత సిబ్బంది మీడియాకు సమాచారమిచ్చారు. దీంతో తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఆమె నివాసం వద్ద గుమికూడారు. అయితే సమయం గడుస్తున్నా ఆమె బయటకు రాలేదు. మీడియా సమావేశాన్ని రద్దు చేసి నేరుగా విచారణకు హాజరవుతారని భావించారు.
ఆమె ప్రయాణించే వాహనానికి భద్రత కల్పించడం కోసం ఢిల్లీ పోలీసులకు చెందిన పైలట్, ఎస్కార్ట్ వాహనాలను కూడా ఒక దశలో సిద్ధం చేసి ఉంచారు. కానీ ఆమె బయటకు రాకపోగా, తన తరఫున ప్రతినిధిగా సోమ భరత్ కుమార్‌ను పంపించారు. దీంతో గురువారం నాటి విచారణకు కవిత హాజరుకావడం లేదని అర్థమైంది. ఈ దశలో తొలుత అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ విచారణకు హాజరుకావడం లేదని, మరో తేదీ కోరుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఈలోగా వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈడీకి రాసిన లేఖ బహిర్గతమైంది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కారణంగా చూపుతూ విచారణకు హాజరుకావడం లేదని అర్థమైంది.
కవితకు మరోసారి సమన్లు..
గురువారం విచారణకు హాజరుకాకపోవడంతో ఈడీ తాజాగ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 20న విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడే వరకు విచారణ వాయిదా వేయాలన్న కవిత అభ్యర్థనను ఈడీ పట్టించుకోలేదు. కాకపోతే మధ్యలో మూడు రోజుల విరామం ఇచ్చి సోమవారం (మార్చి 20న) హాజరుకావాలని పేర్కొంది. ఈలోగా ఇదే కేసుకు సంబంధించి ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. మార్చి 17న (శుక్రవారం) బుచ్చిబాబు హాజరవుతుండగా, మార్చి 18న (శనివారం) మాగుంట హాజరుకావాల్సి ఉంది. అందుకే కవితను మార్చి 20న (సోమవారం) విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి.
అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగింపు.. కోర్టులో కవిత వ్యవహారం ప్రస్తావన
ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరుకాకపోవడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం స్పెషల్ కోర్టులో ప్రస్తావించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన అరుణ్ రామచంద్రన్ పిళ్ళై కస్టడీ గురువారంతో ముగియడంతో ఆయనను రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.కే. నాగ్‌పాల్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలని న్యాయమూర్తిని కోరారు. ఇప్పటికే 10 రోజుల పాటు (తొలుత 7 రోజులు, ఆ తర్వాత మరో 3 రోజులు) కస్టడీకి అప్పగించానని, ఇంకా పొడిగించాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. పిళ్ళైని కవితను కలిపి కన్‌ఫ్రంటేషన్ విధానంలో ప్రశ్నించాల్సి ఉందని, అయితే కవిత గురువారం విచారణకు హాజరుకాకపోవడం వల్ల అది సాధ్యం కాలేదని ఈడీ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా అప్పటివరకు కవితను కేసులో సాక్షిగా ప్రస్తావించిన ఈడీ, గురువారం మాత్రం అనుమానితురాలిగా ప్రస్తావించింది. అనుమానితురాలు కవితతో పిళ్లైని కలిపి ప్రశ్నించాల్సి ఉందని, అందుకే పిళ్లై కస్టడీని మరో 5 రోజులు పొడిగించాలని అభ్యర్థించింది. కవితతో పాటు ఆడిటర్ బుచ్చిబాబు, వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడా కన్‌ఫ్రంటేషన్ విధానంలో పిళ్లైతో పాటు ప్రశ్నించాల్సి ఉందని ఈడీ వెల్లడించింది.
ఈ సందర్భంగా విచారణ పద్ధతుల్లో కన్‌ఫ్రంటేషన్ చాలా ప్రభావవంతమైన పద్ధతి అంటూ పేర్కొన్న న్యాయమూర్తి, ఆ విధానం కోసమే కస్టడీ పొడిగించాలని కోరితే ప్రతి నిందితుడిని 15 రోజుల పాటు కస్టడీకి అప్పగించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ పద్ధతి నిజంగా అవసరమా అన్న విషయాన్ని దర్యాప్తు సంస్థ గుర్తించాలని, ప్రతి వ్యక్తితో కన్‌ఫ్రంటేషన్ జరపాల్సిన అవసరం ఏర్పడుతుందా అని ప్రశ్నించారు. పిళ్ళై – కవిత మధ్య చోటుచేసుకున్న నగదు లావాదేవీల గురించి ప్రశ్నించాల్సి ఉందని ఈడీ అధికారులు చెప్పగా, ఇద్దరి బ్యాంకు స్టేట్మెంట్లను పరిశీలిస్తే సరిపోతుంది కదా అని అన్నారు. ఈ దశలో పిళ్ళై తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఇప్పటికే 10 రోజుల సుదీర్ఘ కస్టోడియల్ విచారణ జరిపారని, అంతకంటే ముందు 39 సార్లు పిలిపించి ప్రశ్నించి స్టేట్మెంట్లు నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు.
మొత్తంగా 50 రోజుల విచారణ జరిగిందని, ఇంత సుదీర్ఘమైన కస్టోడియల్ విచారణ అవసరం లేదని అన్నారు. ఇప్పటి వరకు హోటల్ రికార్డులు, ఇతర పత్రాలను ఎదురుగా పెట్టి పిళ్ళైని ప్రశ్నించామని, ఇప్పుడు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో కన్‌ఫ్రంటేషన్ జరిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. కవిత గైర్హాజరు వ్యవహారాన్ని నొక్కి చెబుతూ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరడంతో స్పెషల్ కోర్టు అందుకు అంగీకరించింది. మార్చి 20 మధ్యాహ్నం గం. 3.00 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్టు కోర్టు తెలిపింది. అప్పట్లోగా ఎవరెవరితో కన్‌ఫ్రంటేషన్ అవసరమో, వారందరితో ఆ విధానంలో విచారణ పూర్తిచేయాలని ఆదేశించింది. కస్టడీలో భాగంగా కుటుంబ సభ్యులు, న్యాయవాది కలవడానికి ఇది వరకు ఏ వెసులుబాటు కల్పించామో అది కొనసాగుతుందని న్యాయమూర్తి ఎం.కే. నాగ్‌పాల్ స్పష్టం చేశారు.
ఢిల్లీలోనే కవిత, కేటీఆర్, హరీశ్ రావు.. రేపు మరోమారు సుప్రీంలో ప్రస్తావన
ఎమ్మెల్సీ కవితతో పాటు రాష్ట్ర మంత్రులు, ఆమె కుటుంబ సభ్యులైన కేటీ రామారావు, హరీశ్ రావు తమ ఢిల్లీ పర్యటనను కొనసాగిస్తున్నారు. గురువారం ఈడీ విచారణకు కవిత బదులుగా సోమ భరత్ కుమార్‌ను పంపించడం సహా కవిత ముందున్న ఇతర న్యాయపరమైన ప్రత్యామ్నాయాల గురించి న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్టుగా తెలిసింది. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టు తలపుతట్టి తాము దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారమే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరనున్నట్టు తెలిసింది.
ఈడీ సమన్లు, విచారణ తీరు, మహిళను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలవడం వంటి అంశాలపై సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా, మార్చి 24న విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే వరకు ఈడీ విచారణను వాయిదా వేయాలని కోరుతూ కవిత ఈడీకి లేఖ రాసినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా మార్చి 20న విచారణకు హాజరుకావాలంటూ మరోసారి సమన్లు జారీ చేయడంతో, ఆలోగా సుప్రీంకోర్టు నుంచి ‘స్టే’ తెచ్చుకోవాలని కేసీఆర్ కుటుంబం భావిస్తోంది. అందుకే శుక్రవారమే తమ పిటిషన్‌పై విచారణ చేపట్టేలా ప్రస్తావించాలని భావిస్తున్నారు.