హైదకాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ)లో కార్మికుల దృష్టి ఇప్పుడు వేతనసవరణపైనే కేంద్రీకృతమైంది. వాస్తవానికి ఆర్టీసీ కార్మికులకు ఐదేళ్ళ క్రితమే వేతనసవరణ జరగాల్సి ఉంది. అయితే… సంస్థ ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడం, ప్రభుత్వం నుంచి తగినస్థాయిలో ఆర్థిక సహకారం లభించకపోవడం తదితర పరిస్థితుల నేపథ్యంలో… కార్మికుల వేతన పెరుగుదలకు చోటులేకుండా పోయింది. ప్రభుత్వోద్యోగులు సహా కార్‌రేషన్, బ్యాంకింగ్ వర్గాలకు వేతనాలు దాదాపు 20-30 శాతం మేర పెరిగినప్పటికీ… ఆర్టీసీ కార్మికులకు మాత్రం మోక్షల లభించలేదు. ఇక మరోవైపు ప్రజాప్రతినిధుల వేతనాలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరగడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల వేతనాలు సైతం దాదాపు 30శాతానికి పైగా పెరిగాయి. ఆర్టీసీ కార్మికుల వేతనాల పెరుగుదల విషయంలో ఎవరికీ పట్టింపు లేకపోవడం దారుణమన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా అన్ని వర్గాల నుంచీ వినవస్తుండడం గమనార్హం.
ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే… తొమ్మిదేళ్ళ క్రితం పెరిగిన వేతనాల తాలూకు బకాయిల చెల్లింపులు ఇప్పటివరకు జరగకపోవడం గమనార్హం. మరీ దారుణమైన పరిస్థితేమిటంటే… ఆర్టీసీ కార్మికులను ప్రభుత్యోద్యోగులతో సమానంగా పరిగణిస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్ర్రి కె.చంద్రశేఖర్ రావే ప్రకటించినప్పటికీ… ఆర్టీసీ కార్మికుల పరిస్థితిలో మాత్రం పెద్దగా మార్పు చోటుచేసుకోకపోవడం శోచనీయమన్న వ్యాఖ్యానాలు ఆయా వర్గాల నుంచి వినవస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా… వేతనసవరణను డిమాండ్ చేస్తూ కార్మికవర్గాలు ఆందోళన దిశగా సమాయత్తమవుతున్నట్లు వినవస్తోంది. ఈ క్రమంలోనే… ప్రధాన కార్మికసంఘాలు త్వరలో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వినవస్తోంది. మరోవైపు సెప్టెంబరు మొదటివారంలో రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ముఖ్యకార్యదర్శికి, సంస్థ యాజమాన్యానికి తమ డిమాండ్‌ను వినిపించాలని, ఆ తర్వాత కూడా తగిన ఫలితం రానిపక్షంలో… సమ్మెకు వెళ్ళాలని కార్మికసంఘాలు యోచిస్తున్నాయి. అయితే… ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో… యాజమాన్యం కూడా కార్మికుల వేతనసవరణ దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంఆనే… త్వరలో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కలిసి వేతనసవరణపై చర్చించేందుకు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.