Friday, November 22, 2024

ఏపీలో పరిషత్ పోరు..బారులు తీరిన ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా, మండల పరిషత్‌ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీలకు ఎన్నిక జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పుతో… పరిషత్‌ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్ నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 660 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 126 ఏకగ్రీవమయ్యాయి. వివిధ కారణాలతో 8 స్థానాలకు ఎన్నికలు నిలిచిపోగా…పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించిన 11 చోట్ల ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 10,047 ఎంపీటీసీలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 375 స్థానాలకు వివిధ కారణాలతో ఎన్నికలు నిర్వహించడం లేదు. 81 మంది అభ్యర్థులు మరణించడంతో మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది.  మొత్తం 2,46,71,002 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పరిషత్‌ ఎన్నికల కోసం 27,751 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 6 వేల 492 సున్నిత పోలింగ్ స్టేషన్లు కాగా….అతి సున్నితమైనవి 6వేల 314 కేంద్రాలు ఉన్నాయి. 247 స్టేషన్లను నక్సల్ ప్రభావిత పోలింగ్ స్టేషనలు ఉన్నాయి. వీటిల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాటు చేశారు. 43, 830 పెద్ద బ్యాలెట్‌ బాక్సులు, 12, 898 మధ్యరకం, 46, 502 చిన్న తరహా బాక్సులను ఎన్నికల్లో వినియోగిస్తున్నారు.  

పోలింగ్ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గుర్తించిన హింసాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ప్రతి సబ్‌ డివిజన్‌లో ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు. 652 మంది రిటర్నింగ్ అధికారులు, 1091 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను ఎన్నికల విధుల్లో ఉన్నారు. పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు 6,524 మంది పరిశీలకులను నియమించారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సిబ్బందికి మాస్క్ లు, హ్యాండ్ శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, హ్యాండ్ గ్లోవ్స్ ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో భౌతిక దూరాన్ని తప్పని సరిగా పాటించేలా చర్యలు తీసుకున్నారు.  పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఎవరైనా కొవిడ్‌ పాజిటివ్ ఉన్న వారు ఉంటే వారికి పీపీఈ కిట్లు అందించే ఏర్పాట్లు కూడా చేశారు. కొవిడ్‌ ఉన్న వారు చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపతాపల్లి పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల నచ్చజెప్పడంతో గొడవ సర్ధుమణిగింది. కడప జిల్లా కమలాపురం మండలం పెద్దచెప్పలి ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి నాగ రాజాచారి ని అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉండగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వెంటనే అతన్ని విడుదల చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement