వీరిది బాధ్యత… వారికి బరువు!!
జన్మహక్కుగా పామర జనం
బద్దకిస్తున్న పండిత వర్గం
సోషల్ మీడియా వేదికగా నీతులు
ఆచరణలో అందుకు విరుద్ధం
ఓటింగే ప్రజాస్వామ్యానికి ప్రాణం
ఓటు విలువ తెలుసుకో
సమాజ బాధ్యతగా మసులుకో
మేధావి వర్గాల సూచనలు
కోర్టులు కల్పించుకోవాలి
ఓటు బాధ్యతను తప్పనిసరిచేయాలి
సామాజికవాదులు, మేధావుల సూచనలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: సమాజంలో ఎన్నో వర్గాలు ఉంటాయి… వారందరిలో వీరిది ప్రత్యేకం… వీరి వేదిక సోషల్ మీడియా… ఎక్కడ, ఏవిధమైన న్యూస్ వెలువడినా తక్షణం స్పందిస్తారు… పుంఖానుపుంఖానులుగా తమ అభిప్రాయాలను పోస్ట్ చేసేస్తుంటారు… యాక్టివిటీస్ మరీ విడ్డూరం… సాయంత్రం కాగానే పబ్‌కు వెళ్లాల్సిందే… సెలవు దొరికిందంటే వినోదాలు, విహారాలు… ఇక ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌ల వీక్షణ… సమాజంలోని మంచి చెడులను ఎత్తి చూపుతుండడమే తమ లక్ష్యం, ధ్యేయం అంటూ చాలా గంభీరంగా వ్యవహరిస్తూ సమాజకోద్దారుకుల్లా చలామణి అవుతుంటారు.
కానీ…చట్టసభలకు అయిదేళ్లకోసారి వచ్చే ఓటింగ్‌కు మాత్రం ఆమడ దూరం! మరోపక్క… రెక్కాడితే కాని డొక్కాడని బడుగుజీవులు… ఇంకోపక్క కిందామీదా పడుతూ బతుకు బండిని పరువుగా లాక్కొచ్చే మధ్య, దిగువ తరగతి వేతన జీవులు… ఉదయం లేచిన దగ్గర నుంచి సూర్యుడితో పోటీ పడుతూ వీరి బతుకు సాగుతుంటుంది… సోషల్ మీడియా చూసే టైమే ఉండదు… ఇక విందులు, వినోదాలంటే అది పండగో వడుకో అయివుండాల్సిందే. సెలవు దినాల్లొనూ కుటుంబం కోసం ఏదోఒక పనిచేసి సేద దీరే టైపే వీరంతా… వీరికి నౌకర్లు, చాకర్లు ఉండరు… అత్యాధునిక సౌకర్యాలు ఒంటికే పడవని భావించే టైపు… కానీ, పోలింగ్ వస్తే అందరికంటే ముందే క్యూలో నిలబడి ఓటు వేయడం తమ బాధ్యతగా భావిస్తారు!
ఇక మొదటి వర్గంలోని వారికి లక్షలాది రూ పాయిల ఆదాయం ఉంటుంది. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు ఉంటారు. అత్యాధునిక సౌకర్యాలు తమ జన్మ హక్కులా అనుభవిస్తుంటారు. అరచేతిలో ఇమిడిపోయే లగ్జరీ స్మార్ట్ ఫోన్లను విలాసంగా మోస్తూ… క్షణానికో పోస్ట్ పెట్టే స్తుం టారు. తమ విచిత్ర, విలక్షణ, అపూర్వ, అమూల్య సలహాలను సమాజానికి ఇచ్చేస్తుంటారు. ఇది తమ గొప్పతనమని, అనితరసాధ్యమని భావి స్తుంటారు… అణగారిన, అరకొర వేతనాలతో బతుకులీడ్చే జనం సమాజానికి ఎంతో బరువుగా వీరికి తోస్తుంటారు.
పల్లెల్లో 95 శాతానికి పైగా ఓటింగ్ జరుగు తుంటుంటే, పట్టణాల్లో మాత్రం సరాసరిన 40 శాతం దాటదు. చదువుకున్నోళ్లు, స్థితిమంతులు ఎందుకు పోలింగ్ రోజు రోడ్డెక్కడం లేదని విశ్లేషిస్తే… వీరికి కోపం పొడుచుకువచ్చినా… దేశ బాధ్యత పట్టడం లేదన్నది మొట్టమొదటి సమా ధానం! ఇక క్యూలైన్లలో ఎక్కువ సేపు ఉన్నత స్థితిలో ఉన్న నవనాగరికులు ఇష్టపడడం లేద న్నది రెండో సమాధానం! పోనీ… ఇందుకు ప్రత్యా మ్నాయం ఏమైనా సూచిస్తారా అంటే అదీ లేదు! ఒకపక్క శత వసంతాలు దాటిన వృద్ధులు ఉత్సా హంగా క్యూలైన్లో కనిపిస్తుంటారు… మరోపక్క అందరికంటే ముందే ఓటేసి ఏదో ఒక పని చూసు కోవాలన్న ఆతృత సామాన్య జనంలో కనిపి స్తుంటుంది.
తమ జీవితాలు ఎంతో ప్రశాంతంగా సాగ డానికి మూల కారణం ఇదే సామాన్యజనం, వారు అనుసరించి, ఆచరించే విధానాలే కారణమని విద్యాధికులు, స్థితిమంతులు తెలుసుకోవాలి. జీవిత పోరాటాన్ని అవిశ్రాంతంగా సాగిస్తూనే… నా ఊరు, నా రాష్ట్రం, నా దేశం అని భావిస్తూ, దాని భవిష్యత్‌కు మేలు చేసే పార్టీలు, నాయకులను ఒక కంట గమనిస్తూనే వీరు ఓటు ఆయుధాన్ని సమ ర్ధంగా ప్రయోగిస్తున్నారు. ఇది తమకు, తమ జీవి తాలకు అత్యంత ప్రాధాన్యం, ప్రమాణికంగా వీరు భావిస్తుంటారు. వీరెవరికీ బోధించరు… ఇతరుల పలుకుబడికి లొంగరు… తమకంటూ ఒక సొంత నిశ్చితాభిప్రాయానికి వస్తారు.అంతరాత్మ ప్రబొధంతోనే ఓటేస్తారు. ప్రజాస్వామ్యానికి వీరే నిజ మైన కస్టోడియన్లు… వీరి నుంచి కనీసం పట్టణ, నగర, నవనాగరీకులు ప్రేరణ పొంది ఓటింగ్ సమాజానికి ఎంత మేలు చేస్తుందో గ్రహించాలని సామాజికవాదులు, మేధావులు సూచిస్తున్నారు.
రాజకీయ పార్టీలు ఏం చెప్పినా… చెబు తు న్నా… ఈ రెండో వర్గం ఆలకిస్తుంది… ఏం మాట్లా డదు… తమకు నచ్చిన పార్టీకి కచ్చితంగా ఓటేస్తుంది. దేశం, సమాజం, రాజకీయ పార్టీలు, నేతలు… ఇలా అన్నింటిపై వీరికి ఒక కచ్చితమైన అభిప్రాయం ఉంటుంది. దాన్ని ఏమాత్రం బయ టకు వెల్లడించరు. పోలింగ్ నాటికి వారొక నిర్దిష్ట అభిప్రాయానికి వస్తారు. చాలా స్పష్టతతో ఓటిం గ్లో పాల్గొంటారు. తమకు నచ్చకపోతే ఎంత పెద్ద ఘనత వహించిన పార్టీ లేదా నేత అయినా పూచికపుల్లలా తీసిపారేస్తారు… ఓటే ఆయుధంగా ప్రయోగించే అత్యంత శక్తివంతమైన బలహీన వర్గం ఇది!