Friday, November 22, 2024

TS | వడివడిగా ఏర్పాట్లు.. రాష్ట్రంలో 1.88 లక్షలకుపైగా పెరిగిన ఓటర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ఎన్నికల రణరంగంలో రెండు కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. సోమవారం నామినేషన్ల పరిశీలన పూర్తవగా, రేపు తుది బరిలో నిల్చే అభ్యర్ధుల సంఖ్య తేటతెల్లం కానున్నది. గత నెలలో షెడ్యూల్‌ జారీ చేసిన తెలంగాణ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు వీలుగా పోలింగ్‌ కేంద్రాలు మొదలుకొని, తుది ఓటర్ల జాబితా వరకు సర్వం పూర్తి చేసింది. ఈ నెల 30న రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్‌ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

డిసెంబర్‌ 3న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. రాష్ట్ర ఎన్నికల నిర్వహణను పారదర్శకంగా పూర్తి చేసే లక్ష్యంతో ఈసీ ఇప్పటికే అబ్జర్వర్లను నియమించింది. వీరంతా ఫీల్డ్‌ లెవల్‌లో పర్యవేక్షణ జరుపుతున్నారు. 67 మంది ఐఏఎస్‌ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించగా.. 39 మంది ఐపీఎస్‌ అధికారులు పోలీసు పరిశీలకులుగా నియామకం చేసిన సంగతి తెలిసిందే.

మరో 60 మంది ఐఆర్‌ఎస్‌ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఇప్పటికే పని మొదలు పెట్టారు. అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్‌ టీ-మ్‌లు, అకౌంటింగ్‌ బృందాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, స్టాటిక్‌ సర్వైలియన్స్‌ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులలో 17 జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేయగా, వీటితోపాటు 89 పోలీసు చెక్‌పోస్టులు, 14 రవాణా, 16 వాణిజ్య పన్నులు, 21 ఎక్సైజు, 8 అటవీ శాఖ చెక్‌పోస్టులు నిరంతరం పహారాతో అక్రమాలను నిరోధిస్తున్నాయి.

తుది ఓటర్ల జాబితా ప్రకటన, ఈవీఎంలు సిద్ధం చేయడం, పోలింగ్‌ అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, కనీస సదుపాయాల కల్పన, దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాల కల్పన, భద్రత ఏర్పాట్లను ఈసీ రాష్ట్రమంతటా పరిశీలించి మరీ అత్యుత్తమ రీతిలో పూర్తి చేసింది. ఈ దఫా తొలిసారిగా దివ్యాంగులకు, 80ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం అమలు చేస్తోంది.

- Advertisement -

తుది ఓటర్ల జాబితా విడుదల…మహిళా ఓటర్లే ఎక్కువ

తుది విడత ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,18,205 ఉండగా, ఇందులో పురుషులు 1,62,98,418మంది, మహిళలు 1,63,01,705మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 3287మంది ఎక్కువగా ఉన్నారు. 119 అసెంబ్లి నియోజకవర్గాలకుగానూ 75 స్థానాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 26 జిల్లాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.

తాజా ఓటర్ల సవరణ కార్యక్రమంలో కొత్తగా 9,99,667 మంది ఓటు హక్కు పొందారు. 18-19 ఏళ్ల ఓటర్లు 8,11,648మంది ఉండగా, అక్టోబర్‌ 31 తర్వాత మరో 1,88,019 మంది నమోదు చేసుకున్నారు. గత నెలలో 998, ఈ ఏడాది జనవరి 5న 992గా ఉన్న ఎన్నికల లింగ నిష్పత్తి ఇప్పుడు 1000కి మెరుగుపడింది.

జనవరి 2023 నుంచి ఓటర్ల సంఖ్యలో నికర పెరుగుదల 8.75 శాతం ఉంది. 80 ఏళ్లు పైబడిన 4,40,371 మంది ఓటర్లు, 5,06,921 మంది పిడబ్ల్యుడి (వికలాంగులు) ఓటర్లు ఉన్నారు. 2023లో 9.48 లక్షల మంది చనిపోయిన, డూప్లికేట్‌, షిప్ట్‌n అయిన ఓటర్లను తొలగించామని, అదేవిధంగా 2023లో 8.94 లక్షల మంది ఓటర్లకు సంబంధించి ఎంట్రీ-లలో సవరణలు చేశామని సీఈవో వికాస్‌రాజ్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement