తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాలు ముగిసి, ప్రస్తుతం సైలెంట్ పీరియడ్ కొనసాగుతోంది. మరోవైపు ఎన్నికల అధికారులు పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, శాంతి భద్రతల పరిరక్షణ చేస్తూ పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక ఐదేళ్లకొకసారి ఎన్నికలలో భాగంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ వంటి నగరాలలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ఉన్న ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. సొంతూర్ల నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, అక్కడ జీవనం సాగిస్తున్న చాలా మంది ఓటర్లు ఇప్పటికే సొంత గ్రామాలకు తిరిగి వచ్చేస్తున్నారు. సొంత ఊర్లకు చేరుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఎన్నికల పోలింగ్ కోసం భారీగా బస్టాండులకు చేరుకోవటంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఓటు వెయ్యడం కోసం గ్రామాలకు తరలివస్తున్న ఓటర్లతో గ్రామాల్లో సందడి వాతావరణం చోటుచేసుకుంది. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు దినాలను ప్రకటించడంతో, ప్రైవేటు కార్యాలయాలలోని సిబ్బందికి సెలవులు ప్రకటించటంతో ఇక సెలవుల నేపధ్యంలో కూడా ఉత్సాహంగా ఊర్లకు చేరుకుంటున్నారు. కనీసం తమ ఊరిని సెలవుల్లో చూసి వచ్చినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో వలస ఓటర్లు ఇళ్లకు బయలుదేరారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చేసిన ప్రచారం సత్ఫలితాలను ఇస్తుందని ఓటు వేసేందుకు వస్తున్న వలస ఓటర్లను చూస్తే అర్ధం అవుతుంది.