ఓటింగ్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే దేశవ్యాప్తంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం అయితే విపరీతంగా ఎండ దంచికొడుతుందని ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సామాన్యులతో పాటు తొలి గంటలోనే పలువురు ప్రముఖులు ఓటు వేశారు.
తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామి సేలంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేయగా.. కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి, తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తమిళనాడు శివగంగలో ఓటు హక్కు వినియోగించుకోగా.. తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ దక్షిణ చెన్నై అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని సాలిగ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్, అజిత్ కుమార్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మహారాష్ట్ర నాగ్‌పుర్ నుంచి ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ.. ఓటు అందరి కర్తవ్యమనీ, ఆ హక్కు వినియోగించుకుని 100 శాతం పోలింగ్ జరిగేలా చూడాలని ఓటర్లను కోరారు.