Thursday, November 21, 2024

వృత్తి విద్యా కోర్సుల ఫీజులు ఖరారు! వచ్చే మూడేళ్ల వరకు ఇవే

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వృత్తి విద్యా కోర్సుల ఫీజులను తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేసింది. 2022-23 ఏడాది నుంచి వచ్చే మూడేళ్లలో ఖరారు చేసిన ఫీజులే అమలులోకి రానున్నాయి. 2019-22 (బ్లాక్‌ పిరియడ్‌)కు సంబంధించి గతంలో నిర్ణయించిన ఫీజుల అమలు గడువు ముగియడంతో 2022-25 బ్లాక్‌ పిరియడ్‌కు సంబంధించి కొత్త ఫీజులను ఖరారు చేసినట్లు టీఏఎఫ్‌ఆర్‌సీ తెలిపింది. ఇంజనీరింగ్‌తో పాటు, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ, బీపీఈడీ వంటి అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ముందస్తుగా బీఈడీ, లా, ఎల్‌ఎల్‌ఎం, బీపీఈడీ కోర్సుల ఫీజులను మాత్రమే ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. బీఈడీ కనిష్ట ఫీజును రూ.20వేలు, గరిష్ట ఫీజును 36వేలుగా నిర్ణయించారు. లా కోర్సు కనిష్ట ఫీజు రూ.20 వేలు, గరిష్ట ఫీజు రూ.36 వేల వరకు ఖరారు చేశారు. ఎల్‌ఎల్‌ఎం కనిష్ట ఫీజు రూ.20 వేల వరకు, గరిష్ట ఫీజు రూ.45 వేలుగా, బీపీఈడీ కనిష్ట ఫీజు రూ.17వేల వరకు, గరిష్ట ఫీజును రూ.28 వేల వరకు ఖరారు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కాలేజీలు 230, లా కాలేజీలు 20, బీపీఈడీ కాలేజీలు 13 ఉన్నాయి. అయితే ఖరారు చేసిన ఈ ఫీజులను ప్రభుత్వానికి పంపించనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొత్త ఫీజులు అందుబాటులోకి రానున్నాయి. ఇంజనీరింగ్‌ ఫీజులు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

గిసిన టీఏఎఫ్‌ఆర్‌సీ పదవి కాలం…

టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ జస్టీస్‌ స్వరూప్‌ రెడ్డి పదవి కాలం ఈనెల 26తో ముగిసింది. ప్రస్తుతం టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ పదవి ఖాళీగానే ఉంది. ఛైర్మన్‌ పదవి కాలం మూడేళ్లపాటు ఉంటుంది. ఇప్పటికే ఈయన రెండు సార్లు టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైఏర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో జూన్‌ 27న ప్రభుత్వం రెండవ సారి ఈయనను నియమించింది. అయితే ఈయన పదవి కాలం 2022, జూన్‌ 26తో ముగియడంతో ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం టీఏఎఫ్‌ఆర్‌సీకు ఛైర్మన్‌ లేరు. అయితే మరోసారి కూడా ఈయనకే ఛైర్మన్‌గా ప్రభుత్వం అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement