- ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
- విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి
- రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
- అసోం ఆలోచనే ప్రేరణ కావాలి
ప్రైవేటుపరం కాబోయిన రిఫైనరీని కొనుగోలు చేసిన అసోం ప్రభుత్వం - ప్రయివేటుపరం కానున్న నుమాలిఘర్ రిఫైనరీ మెజారిటీ వాటాల కొనుగోలుకు అసోం ప్రభుత్వం నిర్ణయం
- ఏపీ ప్రభుత్వం ఇదేబాటలో ముందుకు రావాలని నిపుణుల సూచన
అసోం.. ఓ చిన్న రాష్ట్రం. ప్రస్తుతం బీజేపీ ఏలుబడిలో ఉంది. వచ్చే నెల్లో అసెంబ్లిd ఎన్నికల్ని ఎదుర్కొంటోంది. ఆ రాష్ట్రంలోని నుమాలిఘర్ రిఫైనరీ లోని తన వాటాల్ని అమ్మేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెట్ (బీపీసీఎల్) ముందుకొచ్చింది. ఈ రిఫైనరీలో బీపీసీఎల్ కన్సార్టియంకు 61.65శాతం వాటాలున్నాయి. ఇందులో ఆయిల్ అండ్ ఇంజనీర్స్ కన్సార్టి యం 49శాతం వాటాల్ని కలిగుంది. కేంద్రం అనుసరిస్తున్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణలో భాగంగా బీపీసీఎల్‌లో మెజారిటీ ప్రభుత్వ పెట్టు బడుల్ని ఉపసంహరించుకునే ప్రయత్నం మొదలైంది. ఆ సంస్థ అధీనం లోని నుమాలిఘర్ రిఫైనరీలో ప్రభుత్వ వాటాల్ని విక్రయించుకోవడం కూడా ఇందులో భాగమే. అయితే తమ రాష్ట్రంలోని భారీ రిఫైనరీలో మెజారిటీ వాటాల్ని ప్రభుత్వరంగం నుంచి ప్రైవేటు అధీనంలోకెళ్ళేందుకు అసోం ప్రభుత్వం అంగీకరించలేదు. విక్రయానికి పెట్టిన రిఫైనరీలోని 61.65శాతం వాటాల్ని రూ.9,875 కోట్లకు తామే కొనుగోలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బీపీసీఎల్‌కు తమ ప్రతిపాదన పంపించింది. రిఫైనరీలోని 45,35,45,998 ఈక్విటీ షేర్లు అసోం ప్రభుత్వం లేదా ప్రభుత్వం సూచించే సంస్థ పేరిట బదలాయించేందుకు బీపీసీఎల్ కూడా అంగీకరించింది. ఈ మేరకు ఈ నెల 1వ తేదీన జరిగిన బీపీసీఎల్ డైరెక్టర్ బోర్డ్ ఆమోదం తెలిపింది. ఇదే విషయాన్ని అదే రోజున ముంబై స్టాక్ ఎక్చేంజ్ ఫైలింగ్‌లో నమోదు చేసింది. కేంద్రం బీపీసీఎల్‌లోని 52.98శాతం వాటాల్ని విక్రయించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన రూ.1.75 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణలో ఇదో భాగం. నుమాలిఘర్ రిఫైనరీ ప్రస్తుతం ఏటా మూడు మిలియన్ టన్నుల రిపైనింగ్ సామర్థ్యాన్ని కలిగుంది. 2024నాటికి ఈ సామర్థ్యాన్ని 9మిలియన్ టన్నులకు పెంచనున్నారు. ఇందుకోసం అదనంగా రూ.22,594 కోట్లు వ్యయం చేయనున్నారు. ఇంత భారీ ప్రాజెక్ట్ రూ.10 వేల కోట్ల లోపు పెట్టుబడులతో అసోం రాష్ట్రం తన సొంతం చేసుకుంటోంది. ఈ రిఫైనరీని తన ఆధిపత్యంలోకి తెచ్చుకుంటుంది. మరోవైపు అయిల్ ఇండియా, ఇండియా ఇంజనీర్స్ కన్సార్టీయం సేవలు రిఫైనరీకి కొనసాగనున్నాయి. ఈ రెండు సంస్థలు చమురు రంగ సాంకేతిక పరిజ్ఞానంలోనూ, ఉత్పత్తుల విక్రయంలోనూ అందెవేసినవి. దీంతో వీటి సేవల్ని యదావిధిగా కొనసాగించాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది.
అసోం ప్రభుత్వం ఆలోచల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రేరణ పొందాల్సిన అవసరాన్ని నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ప్రకటన వెలువడగానే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేగింది. ప్రజా ఉద్యమం మొదలైంది. విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కథం తొక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ వారి వెంట నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఖరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలంటూ అధిష్టానానికి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. రోజు రోజుకు ఉక్కు పరిరక్షణ ఉద్యమం ఉధృతరూపం దాలుస్తోంది. ఉక్కు పరిశ్రమను రక్షించుకోవడం ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రాణసమానంగా మారింది. ఇతర పార్టీలతో పోలిస్తే ప్రభుత్వానికిది మరింత ప్రతిష్టగా రూపుదిద్దుకుంది. జగన్ అధికారంలోకొచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని ప్రతిపాదించారు. అలాంటి విశాఖలోని ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణను అధికారపక్షం బలంగా వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఓ వైపు నగరాన్ని ప్రపంచ స్థాయి స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దాలని అభిలషిస్తున్న జగన్‌పై ఉక్కు పరిరక్షణ బాధ్యత మరింత పెరిగింది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని అసోం ప్రభుత్వ తరహా నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (విశాఖ ఉక్కు) సంస్థలో కేంద్రం ఉపసంహరించుకుంటున్న పెట్టుబడులకు సంబంధించిన వాటాల్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్దపడాలని వీరు పేర్కొంటున్నారు. ఇందుకోసం రాష్ట్రానికి ప్రత్యేకంగా రుణసమీకరణ అవకాశం కూడా ఉంటుంది. తిరిగి బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో రుణాలిచ్చే వెసులుబాటు ఏర్పడుతుంది. వీటితో కలసి కన్సార్టీయంగా ఏర్పడి విశాఖ ఉక్కులోని కేంద్ర ప్రభుత్వ వాటాల్ని రాష్ట్రం చేజిక్కించుకోవాలి. దీని నిర్వహణ బాధ్యతను పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకోవాలి.
”విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు” అన్న నినాదం ఇప్పుడు తిరిగి వేళ్ళూనుకుంటోంది. కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న సంభవ్య పోరాటం రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన పరీక్షగా మారింది. ఇప్పటికే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని పక్కనపెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన వాగ్ధానాలన్నింటిని విస్మరించింది. మోడి ప్రభుత్వం ఆదినుంచి ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూస్తోంది. ఇక్కడ బీజేపీకి విస్తరించే అవకాశాల్లేనందున ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కేంద్రం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడంలేదు. విశాఖ ప్రైవేటీకరణ కూడా ఇందులో భాగమే. సుమారు 19 వేల ఎకరాల్లో ఈ పరిశ్రమ విస్తరించుంది. 20 వేల మంది కార్మికులు నేరుగా ఉపాధి పొందుతున్నారు. మరో 40 వేల మంది కార్మికులకు పరోక్షంగా ఇది ఉపాధినిస్తోంది. దీని భూముల విలువే ప్రస్తుత మార్కెట్లో సుమారు రూ.2 లక్షల కోట్లుంటుంది. 1960వ దశకంలోనే ఇక్కడ ఉక్కు కర్మాగార ఆవశ్యకతను గుర్తించారు. అప్పట్లో ఆంగ్లో అమెరికన్ కన్సార్టియం పరిశ్రమ ఏర్పాటుకు సిఫార్స్ చేసింది. అయినప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం వహించడంతో హింసాత్మక ఉద్యమం జరిగింది. ఇందులో కనీసం 32మంది మరణించారు. అనంతరం ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇందుకోసం ఏకంగా 64 గ్రామాల్ని ఖాళీ చేయించింది. దీన్ని తెలుగు ప్రజలు తమ విజయచిహ్నంగా భావిస్తారు.
దీని ఏర్పాటుకు కేంద్రం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం అనే సంస్థను నెలకొల్పింది. అంతకుముందు దీన్ని సెయిల్‌లో భాగంగా ప్రతిపాదించింది. 1982 ఫిబ్రవరి 18న రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌ను కంపెనీ చట్టం క్రింద నమోదు చేసింది. ఇందులో ఈక్విటీ కేపిటల్‌గా రూ.4,890 కోట్లు, ప్రిఫరెన్స్ షేర్ కేపిటల్‌గా రూ.3,110 కోట్లు మొత్తం రూ.8 వేల కోట్లు పెట్టుబడిగా ప్రతిపాదించింది. ఈస్ట్రన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్‌తో కూడిన కన్సార్టీయంను ఏర్పాటు చేసింది. 2018-19నాటికి ఈక్విటీ విలువ రూ.7,342 కోట్లకు చేరింది. మొత్తం ఆస్తుల విలువ రూ.35,201 కోట్లకు పెరిగాయి. ఆ ఏడాది ఆదాయం రూ.20,492 కోట్లు. లాభం రూ.96.71 కోట్లుగా నమోదైంది. ఈస్ట్రన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ సహ సంస్థలుగా ది ఒరిసా డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ 50శాతం, ది బిస్రా స్టోన్లైమ్ కంపెనీ లిమిటెడ్ 26శాతం ఈక్విటీలతో ఏర్పాటయ్యాయి. ప్రస్తుత షేర్ ధరలకనుగుణంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కన్సార్టీయంకు చెందిన వాటాల్ని రాష్ట్ర ప్రభుత్వం కొన ుగోలు చేయాలి. ఇది కొన్ని వేల కోట్లు మాత్రమే ఉంటుంది. కానీ లక్షల కోట్ల విలువైన భూములు, అంతకుమించిన ప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిరక్షణ ఉద్యమాలు ఏ విధంగానూ కేంద్రంపై ఒత్తిడి తేలేవు. ఇప్పటికే కేంద్రంఈ విషయంలో ఓ స్పష్టతకొచ్చేసింది. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఉద్యమాలు, నిరసన ప్రదర్శనల్ని కేంద్రం ఖాతరు చేయదు. పరిశ్రమలో తన వాటాల్ని ఖచ్చితంగా ఉపసంహరించుకుంటుంది. ఈ విషయంలో కేంద్రానికి వేరెవరూ అడ్డుకట్టేయలేరు. చేజేతులా లక్షల కోట్ల విలువైన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక సంస్థ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి తరలిపోకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకట్టేయాలి. ప్రభుత్వ ప్రతిష్టను పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.