మన దేశ పౌర విమానయాన రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్ ఇండియాలో విలీనం చేసుకున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. ఈ డీల్‌కు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఆమోదం తెలిపింది. ఈ విలీనంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటా లభించనుంది. ఈ డీల్ 2024, మార్చి నాటికి పూర్తవుతుందని టాటా గ్రూప్ తెలిపింది. విలీనం ప్రతిపాదనను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్‌కు 51 శాతం, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు మిలిగిన వాటాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం అవుతుందని, తాము ఎయిర్ ఇండియాలో 2,058.5 కోట్లు లావాదేవీల్లో భాగంగా పెట్టుబడి పెడుతున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ మంగళవారం నాడు ప్రకటించింది. విలీనం తరువాత ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 25.1 శాతం వాటా లభిస్తుందని పేర్కొంది.
విస్తారా విలీనంతో 218 విమానాలతో ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఆపరేషన్స్‌లో అతి పెద్ద సంస్థగా అవతరించనుందని టాటా గ్రూప్ తెలిపింది. విలీనం తరువాత దేశీయ విమానయాన సంస్థల్లో ఎయిర్ ఇండియా రెండో స్థానానికి చేరుకోనుంది. 2022-23, 2023-24 ఆర్ధిక సంవత్సరంలో అవసరమైనప్పుడు ఎయిర్ ఇండియాలో అదనపు పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒప్పందం చేసుకున్నాయి. విలీనం పూర్తయిన తరువాత అదనంగా 50,200 మిలియన్ రూపాయల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని సింగపూర్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
విలీనంతో ఎయిర్ ఇండియా వరల్డ్ క్లాస్ ఎయిర్‌లైన్‌గా మారుతుందని టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. ఎయిర్ ఇండియా నెట్‌వర్క్ విస్తరించుకోవడంతో పాటు, కొత్త విమానాలను కూడా సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం టాటా గ్రూప్‌లో నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియా ప్రస్తుతం టాటా గ్రూప్‌లో ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను టాటా గ్రూప్ ఈ సంవత్సరం జనవరిలో ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. విస్తారా 2015, జనవరి నుంచి ఆపరేషన్స్ ప్రారంభించింది. ఎయిర్ ఏషియా ఇండియా 2014లో ప్రారంభమైంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 2005 నుంచి ఆపరేషన్స్ ప్రారంభించింది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో దేశీయ విమానయాన రంగంలో రెండో స్థానంలో నిలిచింది.
విస్తారాకు 9.2 శాతం మార్కెట్ వాటా ఉంది. అగ్రస్థానంలో ఉన్న ఇండిగో కు 56.7 శాతం మార్కెట్ వాటా ఉంది. ఎయిర్ ఇండియాకు దేశీయ విమానయాన రంగంలో 9.2 శాతం, ఎయిర్ ఏషియా ఇండియాకు 7.6 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. సమయానికి విమానాలను నడిపించడంలో ఎయిర్ ఇండియా ట్రాక్ రికార్డ్ 90.8 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. విస్తారా, ఎయిర్ ఏషియా ఇండియాలు 89.1 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. భారత దేశ విమానయాన రంగంలో ఈ విలీనంతో మరిన్ని అవకాశాలు తమకు వస్తాయని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈసీఓ ఘో ఛూన్ ఫాంగ్ చెప్పారు. విలీనంతో టాటా గ్రూప్‌తో తమ బంధం మరింత బలపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.