Friday, November 22, 2024

విశ్వనాథ్‌ ఆనంద్‌ 37 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత్‌ నెం.1 చెస్‌ ప్లేయర్‌గా యువ గ్రాండ్‌మాస్టర్‌

దాదాపు 37 ఏళ్లపాటు భారత చెస్‌లో రారాజుగా ఏలిన విశ్వనాథ్‌ ఆనంద్‌ను తాజాగా 17 ఏళ్ల యువ గ్రాండ్‌మాస్టర్‌ డి. గుకేశ్‌ వెనుకకు నెట్టి నంబర్‌-1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఫిడే తాజా ర్యాంకింగ్స్‌లో గుకేశ్‌ 2758 పాయింట్లతో భారత్‌ తరఫున అగ్ర స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానాన్ని అందుకున్నాడు. ఇక ఐదుసార్లు విశ్వ విజేతగా నిలిచిన దిగ్గజ ప్లేయర్‌ విశ్వనాథ్‌ ఆనంద్‌ 2754 పాయింట్లతో భారత్‌ తరఫున రెండోవ, ఓవరాల్‌గా 9వ స్థానానికి పడిపోయాడు.

దీంతో భారత్‌ తరఫున గుకేశ్‌ అగ్ర స్థానానికి ఎగబాకి కొత్త చరిత్ర సృష్టించాడు. గురువును దాటేసిన శిశ్యుడిగా గుకేశ్‌ అవతరించాడు. ఆనంద్‌ 1986 నుంచి ఇప్పటివరకు సుదీర్ఘకాలం భారత టాప్‌ ప్లేయర్‌గా కొనసాగాడు. తాజాగా అతని స్థానాన్ని యువ గ్రాండ్‌ మాస్టర్‌ సొంతం చేసుకొని సత్తా చాటుకున్నాడు. గత ఆగస్టులో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లో ప్రవేశించిన గుకేశ్‌ నెల వ్యవధిలోనే ఏకంగా మూడు స్థానాలు మెరుగుపర్చుకోవడం విశేషం.

- Advertisement -

గత ఏడాది మహబలిపురంలో జరిగిన 44వ ఒలింపియడ్‌లో 11/9 రికార్డు స్కోరు సాధించడంతో పాటు ప్రపంచ నెంబర్‌వన్‌ కార్ల్‌సన్‌పై నెగ్గి స్వర్ణ పతకంతో సంచలనం సృష్టించాడు. దీంతో గుకేశ్‌కు ఆసియా చెస్‌ ఫెడరేషన్‌ (ఏసీఎఫ్‌) మార్చి-2023లో ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో సత్కరించింది. గుకేశ్‌ 2700 (ఈఎల్‌ఓ) రేటింగ్‌ పాయింట్స్‌ను అందుకున్న భారత యువ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు సాధించాడు.

ఇక శుక్రవారం విడుదలైన ఫిడే తాజా ర్యాంకింగ్స్‌లో నార్వే స్టార్‌ కార్ల్‌సన్‌ 2839 పాయింట్లతో తన ప్రపంచ నంబర్‌వన్‌ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. దశాబ్ద కాలంగా కార్ల్‌సన్‌ ఈ టాప్‌ ప్లెస్‌లోనే కొనసాగుతున్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో కార్ల్‌సన్‌కు గట్టిపోటీ ఇచ్చిన మరో యువ భారత గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానంద 2727 పాయింట్లతో 19వ స్థానానికి ఎగబాకాడు.

భారత్‌ తరఫును మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు విదిత్‌ సంతోష్‌ (27వ), అర్జున్‌ ఇరిగైసి (29వ) టాప్‌-30 స్థానాల్లో చోటు సాధించారు. మరోవైపు మహిళల విభాగంలో కోనెరు హంపి 2550 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. రానున్న కాలంలో భారత యువ గ్రాండ్‌మాస్టర్లు ప్రపంచ చెస్‌ రంగాన్ని ఏలడం ఖాయమనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement