కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. నీటి దొంగలెవరో తెలిసిపోయిందని ఆయన పేర్కొన్నారు. అక్రమ ప్రాజెక్టులు నిర్మించి నీటి చౌర్యం, అక్రమ విద్యుత్ ఉత్పత్తి చేయకుంటే ఈ నోటిఫికేషన్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సీఎం కేసీఆర్‌ను విష్ణువర్ధన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
అంతర్ రాష్ట్ర జలవివాదాలు, ప్రాజెక్టుల పరిరక్షణను కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చే నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని తెలంగాణ సర్కారును విష్ణు నిలదీశారు. ‘నీటి దొంగలు ఎవరనేది ప్రజలకు తెలుస్తుందని భయపడుతున్నారా? కానీ, ఇప్పుడు దొంగలెవరో, దొరలెవరో ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. దొంగే దొంగా దొంగా అని అరుస్తున్న రీతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందరికీ అర్థమైంది. మీరు తప్పు చేయకపోతే కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించాలి’ అని స్పష్టం చేశారు.
ఈ వార్త కూడా చదవండి: సీఎం జగన్‌కు మరోసారి లేఖ రాసిన ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు