Tuesday, November 26, 2024

విశాఖ పోర్టు ఆల్‌టైమ్‌ రికార్డు.. రూ.1446 కోట్లతో కీలక ప్రాజెక్టులు..

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: విశాఖ పోర్టు ట్రస్టు ఇటీవల కాలంలో ఆల్‌టైమ్‌ రికార్డుల దిశగా ముందుకు సాగుతోంది. ఇటీవలే కార్గో హ్యాండ్లింగ్‌లో అరుదైన ఘనతను దక్కించుకున్న ఈ పోర్టు, తాజాగా సుమారు 1446 కోట్ల రూపాయల వ్యయంతో పలు కీలక ప్రాజెక్టులను చేపడుతుంది. సుమారు 167 కోట్ల రూపాయలతో చేపట్టిన ఓఆర్‌ 1, ఓఆర్‌ 2 ప్రాజెక్టుల విస్తరణకు సంబంధించిన పనులు ఇటీవలే వేగవంతం చేశారు. ఈ పనులు 2023 సెప్టెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఓఅర్‌ 3 బెర్త్‌ ఇప్పటికే విస్తరణ పూర్తి చేసుకుని మనుగడలోకి వచ్చింది. 28 కోట్ల రూపాయల వ్యయంతో ఓఆర్‌ 1, ఓఆర్‌ 2 బెర్త్‌ లపై అగ్నిమాపక వ్యవస్ధను పెద్ద ఓడలను హ్యాండిల్‌ చేసేందుకు అనుగుణంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్టోబర్‌ 2022 నాటికి ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో వైపు 53 కోట్ల రూపాయల వ్యయంతో క్రూయిజ్‌ టెర్మినల్‌ను అభివృద్ది పరిచేందుకు చర్యలు చేపట్టారు. ఆయా పనులు ఏప్రిల్‌ 2023 నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక 288.47 కోట్ల రూపాయల వ్యయంతో డబ్యూ క్యూ 7,8 బెర్త్‌ల ఆధునికీకరణ పనులను జనవరి 2025 నాటికి పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

165.7 కోట్ల రూపాయల వ్యయంతో డబ్యూ క్యూ 7 బెర్త్‌ ను పూర్తి స్ధాయిలో ఆధునికీకరించేందుకు పనులు జరుగుతున్నాయి.100 కోట్ల రూపాయలతో ఈక్యూ 6 ప్రాజెక్టును పూర్తి స్ధాయిలో ఎరువులను హ్యాండిల్‌ చేసేలా ఆధునీకీకరణకు చర్యలు చేపట్టారు. 250 కోట్ల రూపాయల వ్యయంతో ఈక్యూ 1ఏ బెర్త్‌ ను ఎరువుల హ్యాండ్లింగ్‌ కోసం పూర్తి స్ధాయిలో ఆధునీకరించేందుకు నిర్ణయించారు. ఈ క్యూ 1 ప్రాజెక్టును సైతం ఎరువుల కోసం యంత్రీకరించేందుకు పనులు జరుగుతున్నాయి. 152 కోట్ల రూపాయల వ్యయంతో ఫిష్షింగ్‌ హార్బర్‌ను ఆధునీకరించేందుకు పనులు ప్రారంభించారు. 40 కోట్ల రూపాయలతో వివిధ డిజిటల్‌ కార్యక్రమాలకు పోర్టు శ్రీకారం చుట్టింది. శాప్‌ హనా ఉన్నతీకరణ, నూతన పిఓఎస్‌ వినియోగం, ఇంటిలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టం వంటి పనులను జులై 2023 నాటికి పూర్తి స్ధాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఇటీవలే విశాఖ పోర్టులో పర్యటించిన కేంద్ర మంత్రి సర్బానంద్‌ సోనావాల్‌ ఆయా ప్రాజెక్టులకు సంబంధించి పోర్టు తీసుకుంటున్న చర్యల పట్ల పూర్తి స్ధాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. రెండేళ్ల తక్కువ సమయంలో పోర్టు ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు పోర్టు చైర్మన్‌ కె.రామ్మోహనరావు చేపట్టిన అభివృద్ది పనులను కేంద్రమంత్రి ప్రశంసించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement