విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో : విశాఖ అత్యంత ప్రశాంతమైన నగరం. జాతీయ, అంతర్జాతీయ సభలు, సమావేశాలు నిర్వహణకు అన్ని హంగులు కలిగిన ఏకైక నగరంగా అంతర్జాతీయ చిత్రపటంలో ప్రముఖంగా పేరుగాంచింది. అందుకు తగ్గట్లుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గత రెండేళ్లుగా ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు అన్నీ కూడా విశాఖ వేదికగానే నిర్వహిస్తూ జాతీయ, విదేశీయ ప్రముఖులకు చక్కని ఆతిద్యం ఇవ్వగలుగుతున్నారు. అయితే వీటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంతో పాటు నగర పోలీసులపైన కూడా అత్యంత ముఖ్యంగా ఉంది. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా విశాఖ పోలీసులు అహోరాత్రులు శ్రమించి అన్ని సదస్సులు, ఉత్సవాలు సమన్వయంతో విజయవంతం చేయగలుగుతున్నారు.
గతంలో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ వంటి అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు ఆతిథ్యమిచ్చిన మహావిశాఖ తాజాగా మరో రెండు అంతర్జాతీయ సమావేశాలకు సర్వం సిద్ధమవుతోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ ఆంధ్రవిశ్వకళాపరిషత్ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇక అదే నెల 28, 29 తేదీల్లో ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలు రెండు రోజుల పాటు ఇక్కడే నిర్వహిస్తున్నారు. అయితే ఒకే నెలలో రెండు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి సమావేశాలు విశాఖలో జరగనుండడంతో విశాఖ నగరపోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
3, 4 తేదీల్లో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులంతా నగరానికి తరలిరానున్నట్లు సీపీ వెల్లడించారు. ఇప్పటి వరకు 6100 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆరుగురు కేంద్రమంత్రులు, మరో ఆరుగురు రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్తలు హాజరు కానున్నట్లు ఇప్పటి వరకు తమ వద్ద సమాచారం ఉందన్నారు. వీరితో పాటు మరో 282 మంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు పెట్టుబడుల సదస్సులో పాల్గొంటున్నట్లు సీపీ తెలిపారు. వీరందరితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక మంది ఉన్నతస్థాయి అధికారులు, ముఖ్య అధికారులు పెట్టుబడుల సదస్సులో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందులో కొంత మంది 3వ తేదన మరికొంత మంది 4వ తేదీన నగరానికి రానున్నట్లు సమాచారం ఉందన్నారు.
ఎక్కువ మంది విదేశీయ వ్యాపారవేత్తలు, వివిధ రంగాల్లో నిష్ణాతులు నగరానికి రానుండడంతో భారీ పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సుమారు 7 నుంచి 8వేల మంది ప్రముఖులు పెట్టుబడుదారుల సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. వీరు ప్రయాణించే రహదారులు, పాల్గొనే సభాప్రాంగణ ఆ తరువాత పర్యటించే ప్రాంతాల్లోనూ విస్తృతంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మరో వైపు జీ-20 సమావేశాలకు సంబంధించి 49 దేశాలకు చెందిన విదేశీయుల బృందం 28, 29 తేదీల్లో నగరంలో పర్యటించనుందన్నారు. ఇందులో సుమారు 150 మంది విదేశీయులతో పాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అనేక మంది ప్రముఖులు తరలిరావడం జరుగుతుందన్నారు.
రెండు దశల్లో 4000 మంది పోలీసు బందోబస్తు..
మార్చి నెలలో జరగనున్న పెట్టుబడుదారుల సదస్సు, జీ-20 సమావేశాల నేపధ్యంలో ఇప్పటికే బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశామని నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ వివరించారు. రెండు కార్యక్రమాలకు సంబంధించి దశల వారీగా 4000 మంది సిబ్బందిని భద్రతా ఏర్పాట్ల కోసం నియమిస్తామన్నారు. ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకొని ఆయా సమావేశాలను విజయవంతం చేస్తామన్నారు. రెండు అంతర్జాతీయ సమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కోటి రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు.
2022లో 1600 మంది ప్రముఖులు విశాఖ సందర్శన..
ఇటీవల కాలంలో అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు విశాఖలోనే అత్యధికంగా జరుగుతున్నందున అందుకు తగ్గట్లుగానే పోలీసు బందోబస్తు ఏర్పాట్లను చేస్తున్నామని సీపీ శ్రీకాంత్ తెలిపారు. 2021లో 640 మంది ప్రముఖులు వివిధ కార్యక్రమాల నిమిత్తం నగరానికి రావడం జరిగిందన్నారు. ఇక 2002లో 1600 మంది అత్యంత ప్రముఖులు నగరాన్ని సందర్శించారన్నారు. విశాఖ ప్రాధాన్యత నానాటికి పెరుగుతున్న నేపధ్యంలో ఇక్కడ నిర్వహించే సమావేశాలు, సదస్సులు కూడా క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయన్నారు. అయితే విశాఖ ప్రశాంతనగరమని అందుకు తగ్గట్లుగానే అన్ని జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు ఆ స్థాయిలోనే విజయవంతం కావడం జరుగుతుందన్నారు. అందరి సహకారంతోనే ఆయా సదస్సులకు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయగలుగుతున్నామన్నారు. విశాఖ సాగరతీరంలో శాంతిభద్రతలకు ఎటువంటి సమస్య లేకుండా సమన్వయంతో ముందుకు సాగుతున్నామని సీపీ వివరించారు.
తగ్గుముఖం పట్టిన కేసులు.. రౌడీయిజం చేస్తే అణిచివేస్తాం..
గతం లో కంటే విశాఖలో కేసుల సంఖ్య ఘననీయంగా తగ్గుముఖం పట్టిందన్నారు. క్షణికావేశంలో జరిగిన నేరాలు తప్ప ఇతరత్ర కేసుల సంఖ్య ఏ మాత్రం పెరగలేదన్నారు. నగరంలో రౌడీయిజం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ఇప్పటికే ముగ్గురికి సంబంధించి నగర బహిష్కరణ విధించామన్నారు. అంతకు మించి ఓవర్‌యాక్షన్ చేస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామన్నారు. విశాఖ జిల్లాలో గంజాయి సాగు జరగడం లేదని ప్రస్తుతం నమోదవుతున్న గంజాయి కేసులకు సంబంధించి పక్క రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిందే అధికమన్నారు. గత ఏడాదిలో 4500 కేజీలు గంజాయి కోరాపుట్ ప్రాంతం నుంచి తీసుకువచ్చిందేనని తాము గుర్తించామన్నారు. గంజాయి పండించే వారితో పాటు విక్రయదారులకు సంబంధించి కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు. సైబర్ క్రైమ్ నేరాలను నియంత్రించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. ఇందు కోసం విశాఖలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నామన్నారు.
ఒక్కొక్క పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరేసి చొప్పున సైబర్ వారియర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. అయితే ప్రజల్లో కూడా అవగాహన కల్పించడం వల్ల సైబర్ నేరాలను వీలైనంత త్వరగా నియంత్రించగలుగుతామన్నారు. అయితే సైబర్ నేరాలకు పాల్పడే వారిలో అత్యధిక శాతం రాజస్థాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, దిల్లిd ప్రాంతాలకు చెందిన వారే అత్యధికంగా ఉంటున్నట్లు చెప్పారు. తమకు సంబంధం లేని ఎటువంటి మెసేజులు, లింక్‌లు ఓపెన్ చేయకుండా , ప్రజల వివరాలు అందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆన్‌లైన్ ఉద్యోగాల పేరిట ఎక్కువ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రజల సహకారం మరువలేనిదని, అందుకనే విశాఖలో పోలీసులు అన్ని సదస్సులు, సమావేశాలు, ఉత్సవాలను విజయవంతం చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా సంపూర్ణ స హకారం అందిస్తుందన్నారు.