న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: చమురు, సహజవాయవుల రంగానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త అంశాలపై విశిష్ట పరిశోధనలు చేస్తూ, పెట్రోలియం, ఇంధన రంగాలలో సుశిక్షితులైన మానవ వనరులును అభివృద్ధి చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా విశాఖపట్నంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) ఏర్పాటు చేసినట్లు కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ తెలిపారు. రాజ్యసభలో సోమవారం విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఈ లక్ష్యంతోనే రాజీవ్ ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సంస్థకు అనుబంధంగా రెండు కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో రెండు సెంటర్లను విస్తరించినట్లు తెలిపారు.
చమురు, సహజవాయువు రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు ఐఐటీ-ముంబైతో కలిసి సంయుక్తంగా చమురు, సహజవాయువు రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కోసం ముంబైలో విశిష్ట కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇంధన పరిశ్రమను ఏకీకృత లక్ష్యం వైపు నడిపించడం, కాంప్లెక్స్ ఎనర్జీ, పర్యావరణ అంశాలకు సంబంధించి అనువైన పరిష్కారాల మార్గాలు అభివృద్ధి చేయడం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయడం, టెక్నాలజీకి సంబంధించి కొత్త హద్దులు అన్వేషించడం లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించినట్లు మంత్రి తెలిపారు.