న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం కేంద్ర ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిని కలిసి తన శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, విశాఖ స్టీల్ ప్లాంట్‌పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్డింగ్‌ను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తామని, లేదంటే స్టీల్ ప్లాంటును తామే (రాష్ట్ర ప్రభుత్వమే) సాధించుకుంటామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశం గురించి మాట్లాడుతూ ధాన్యం సేకరణ గురించి చర్చించినట్టు చెప్పారు.
మంత్రిగా తాను సంవత్సర కాలం పూర్తి చేసుకున్నానని, ఏడాదిలో మంత్రిత్వశాఖలో అనేక మార్పులు తీసుకువచ్చానని అన్నారు. రైతులకు దళారి వ్యవస్థను దూరం చేయడంతో పాటు వారికి సరైన గిట్టుబాటు ధర వచ్చేలా ప్రయత్నించానని తెలిపారు. నేరుగా రైతుల వద్ద నుంచి పంటను కొనుగోలు చేస్తున్నామని, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో 22 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ని కేంద్ర మంత్రి ప్రశంసించారని తెలిపారు. గోధుమ పిండి, రాగులు, జొన్నలను ప్రజలకు పంపిణీ చేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
చిట్ ఫండ్ కంపెనీ విషయంలో తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు జగన్ ను విమర్శించాన్ని మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తప్పుబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి వైఎస్సార్సీపీ 175 సీట్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. చివరి బంతి వరకు పోరాటం అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. అసలు ఆయన ముఖ్యమంత్రి ఎందుకయ్యారో తెలియదని, ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని అన్నారు. పార్టీలో అసంతృప్తుల గురించి ప్రశ్నించగా.. మళ్లీ గెలవలేనివారు, మంత్రి పదవులు దక్కనివారు అలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయినప్పటికీ మళ్లీ జగన్ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కారుమూరు అన్నారు. లోకేశ్‌ను జనం జోకర్లా చూస్తున్నారని, ఎన్నికల్లో చంద్రబాబు – లోకేశ్ ప్రభావం ఏమాత్రం ఉండబోదని అన్నారు.