Tuesday, November 26, 2024

ఫ్రాన్స్, అమెరికాలో వైరస్‌ యమ స్పీడ్.. ప్రపంచ వ్యాప్తంగా 16లక్షల పాజిటివ్‌ కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలపై మళ్లీ కరోనా పంజా విసురుతున్నది. రికార్డు స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో చాలా దేశాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తాజాగా 16.39 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రిటన్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌లో లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్‌లో ఎన్నడూ లేని విధంగా గడిచిన 24 గంటల్లో 2లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 1,01,91,926కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 110 మంది ప్రాణాలు కోల్పోగా.. 43వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,23,851గా ఉండగా.. 81,34,951 మంది కరోనాను జయించారు. ఫ్రాన్స్‌ తరువాత అమెరికాలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 1,61,398 మంది కరోనా బారినపడ్డారు. 257 మంది చనిపోయారు. 15వేల మంది రికవరీ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు 5.58కోట్ల మంది కరోనా బారినపడగా.. 8.47 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. 4.15కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఆ తరువాత ఇటలీలో 1,41,262 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 62.66 లక్షల మంది కరోనా బారినపడ్డారు. 1.37లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. 51.07లక్షల మంది కోలుకున్నారు.

కరోనా సునామీ : డబ్ల్యూహెచ్‌ఓ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సునామీకి ఒమిక్రాన్‌ వ్యాప్తే కారణమని ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం అంతం అవుతుందంటున్న సమయంలోనే ఒమిక్రాన్‌ పంజా విసురుతోందన్నారు. ఈ కొత్త వేరియంట్‌ తీవ్రత తక్కువే ఉన్నప్పటికీ.. వ్యాప్తి ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చారు. వేగంగా వ్యాప్తి చెందుతుండటంతోనే కేసులు భారీగా పెరుగుతున్నాయని వివరించారు. అయితే దీని కోసం వ్యాక్సినేషన్‌ ఒకటే మార్గమని చెప్పుకొచ్చారు. అన్ని దేశాలు వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి కరోనా వ్యాప్తిని నిరోధించగలవని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement