టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. గతంలో 2019 వరల్డ్‌కప్ సమయంలో కూడా వీరిద్దరూ డ్రెస్సింగ్ రూమ్‌లో కనీసం మాట్లాడుకోరు అన్న వార్తలు వినిపించాయి. తాజాగా మరోసారి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయన్న విషయం స్పష్టమైంది. ఇటీవల టీ20లకు విరాట్ కోహ్లి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడం వెనుక రోహిత్ ఉన్నాడని తెలుస్తోంది.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ వైస్ కెప్టెన్. అతడు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉండటం కోహ్లీకి ఇష్టం లేదని పీటీఐ ఓ కథనంలో పేర్కొంది. రోహిత్ వయసు 34 ఏళ్లు కాబట్టి అతడి స్థానంలో వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు, టీ20ల్లో రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు ఇవ్వాలని కోహ్లీ పట్టుబడినట్లు సదరు కథనం ద్వారా తెలుస్తోంది. ఇదే విషయాన్ని విరాట్ కోహ్లీ సెలక్షన్ కమిటీకి చెప్పగా.. అది కాస్తా బోర్డు చెవిన పడి కోహ్లిపై అసంతృప్తికి కారణమైనట్లు సమాచారం. రోహిత్ లాంటి నిఖార్సైన ఆటగాడిని కోహ్లీ తప్పించాలని కోరడంతో అతడిపై విమర్శలు వచ్చినట్లు టాక్. నిజానికి భారత జట్టు డ్రెస్సింగ్ రూంలోనూ రోహిత్‌నే ఆటగాళ్లు ఇష్టపడతారని ఇటీవల బీసీసీఐ అధికారి స్వయంగా చెప్పడం గమనార్హం. యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో రోహిత్ ఎప్పుడూ ముందే ఉంటాడని, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా దీనిని చేసి చూపెడుతున్నాడని సదరు అధికారి చెప్పారు. దీంతో కొన్ని రోజులుగా డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లికి పూర్తి సపోర్ట్ దక్కడం లేదట. అందుకే కోహ్లీ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు వదులుకున్నాడట. త్వరలోనే వన్డే కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ తప్పుకుంటాడని తెలుస్తోంది.