భారత్-ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ టెస్టులో ఇరు జట్లు పరస్పరం కవ్వించుకోవడంపై కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. ఆ టెస్టులో ఎటువంటి వ్యాఖ్యలు చేసుకున్నామన్నది బయటకు చెప్పబోమని అన్నాడు. కెమెరా, స్టంప్ మైక్ ఆధారంగా తాము ఆ మాటలను విశ్లేషించుకున్నామని తెలిపాడు. మ్యాచ్ ముగిశాక వాటిని పట్టించుకోబోమని, తాము చరిత్రను పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడేటప్పుడు అహాన్ని మాత్రం ప్రదర్శించవద్దని అన్నాడు. ప్రపంచంలోని ఏ మైదానంతో పోల్చి చూసినా ఇంగ్లాండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెప్పాడు. ఇక్కడ ఓపికగా, క్రమశిక్షణగా ఆడాల్సి ఉంటుందని అన్నాడు.
బలంగా ఉన్న ఇంగ్లాండ్ జట్టును తాము ఓడించగలమని చెప్పాడు. అయితే, మూడో టెస్టుకు సిద్ధం చేసిన పిచ్ ఆశ్చర్యపరిచిందని, పచ్చికతో కూడిన పిచ్‌ను రూపొందిస్తారని భావిస్తే తక్కువ పచ్చిక కనిపిస్తోందని తెలిపాడు. ఇంగ్లండ్ జట్టులో కీలక ఆటగాళ్లు ఉన్నా వారిని టీమిండియా ఓడించగలదని, ప్రత్యర్థి బలహీనంగా ఉండాలని తాము కోరుకోబోమని చెప్పాడు. అలాగే, ఆటగాళ్లు గాయపడితే తప్ప గెలుపు కూర్పును మార్చబోమని ఆయన చెప్పాడు. అయితే, పిచ్‌ను బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని తెలిపాడు. తాము ఎప్పుడైనా సరే 12 మందితో జట్టును సిద్ధం చేస్తామని, మొదటి, మూడు, నాలుగు రోజుల్లో పిచ్‌ను అంచనా వేసి తుది 11 మందిని ఎంపిక చేస్తామని తెలిపాడు.
ఇది కూడా చదవండి: తన ఖరీదైన లంబోర్ఘిని ఉరుస్ కారుతో ఫొటో దిగిన ఎన్టీఆర్..