Tuesday, November 26, 2024

కోహ్లీ-రోహిత్ కెప్టెన్సీ వార్..

ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమిపాలవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ప్రముఖ క్రికెటర్లు కోహ్లీ కెప్టెన్సీపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కూడా కోహ్లీ కెప్టెన్సీపై అనుమానాలు వ్యక్తం చేశాడు. కెప్టెన్సీలో కోహ్లీ కన్నా రోహిత్ శర్మ చాలా మిన్న అని అన్నాడు. ‘‘కోహ్లీ కన్నా రోహితే మంచి కెప్టెన్ అని నేననుకుంటున్నాను. 2018 ఆసియా కప్ సందర్భంగా రోహిత్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో నేను చాలా దగ్గర్నుంచి చూశా. స్టాండిన్ కెప్టెన్ గా వచ్చినా చాలా సహజంగా నిర్ణయాలు తీసుకోవడంలో రోహిత్ ధిట్ట. కోహ్లీ కెప్టెన్సీలో ఐదేళ్లు ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలచిన టీమిండియా.. ఫైనల్ లో చతికిల పడింది. దీంతో అతడి కెప్టెన్సీపై అనుమానాలు రావడం సహజం’’ అని తన సొంత యూట్యూబ్ చానెల్ లో వ్యాఖ్యానించాడు.

అయితే, ట్రోఫీలు గెలిస్తేనే మంచి కెప్టెన్ అని అనలేమని, కొన్ని కొన్నిసార్లు పెద్ద పెద్ద టోర్నీలు గెలవాలంటే అదృష్టం కూడా తోడవ్వాలని, కానీ, కోహ్లీకి అదృష్టం కలిసి రావట్లేదని చెప్పుకొచ్చాడు. కోహ్లీకి ఎప్పుడూ గెలవాలనే కసి ఉంటుందని, దాన్నంతా తన ఎనర్జీలోనే చూపిస్తాడని చెప్పాడు. ఇండియా ఓడిపోతే మాత్రం కోహ్లీ దూకుడు స్వభావాన్ని అందరూ వేలెత్తి చూపిస్తున్నారని అన్నాడు. అయితే, దూకుడు స్వభావం కాకుండా ప్రశాంతంగా ఉండే కెప్టెన్లే ఫైనల్ పోరుల్లో విజయం సాధిస్తారని చెప్పాడు. కోహ్లీ అత్యుత్తమ క్రికెటరే అయినా.. ఒక్క టైటిలూ అతడి ఖాతాలో లేదన్నాడు. ఇప్పటిదాకా ప్రపంచ టైటిళ్లు సాధించిన చాలా మంది కెప్టెన్లు ప్రశాంత స్వభావులేనని గుర్తు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement