Saturday, November 23, 2024

రూ.5.5 కోట్లకు అమ్ముడైన యూట్యూబ్ వైరల్ వీడియో

యూట్యూబ్‌లో చిన్నారుల ఫన్నీ వీడియోలు భలే సరదాగా ఉంటాయి. వీటిని భారీ సంఖ్యలో చిన్నారులు, పెద్దలు వీక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘చార్లీ బిట్ మై ఫింగర్’ అనే చిన్నారుల వీడియో రూ.5.5 కోట్లకు అమ్ముడుపోవడం సంచలనంగా మారింది. ఈ వీడియోకు నాన్ ఫంజిబుల్ టోకెన్ పద్దతి (ఎన్ఎఫ్‌టి)లో వేలంపాట నిర్వహించగా 11 దేశాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారు. ఎన్ఎఫ్‌టి అంటే ప్రత్యేకమైన డిజిటల్ ఆస్తులు అనమాట. వీటిని బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓ వ్యక్తి కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు.

2007లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ‘చార్లీ బిట్ మై ఫింగర్’ వీడియోకు ఇప్పటికే 900 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలో చార్లీ డేవిస్ కార్ అనే బుడ్డోడు.. తన అన్న హ్యారీ డేవిస్ కార్ వేలును కొరుకుతాడు. దాంతో మరోసారి నోట్లో వేలు పెట్టడంతో ఇంకా గట్టిగా కొరుకుతాడు. దీంతో బుడ్డోడు నవ్వులతో మురిసిపోతే.. పెద్దోడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ నవ్వులు పూయిస్తారు. ఈ ఫన్నీ విపరీతంగా వైరల్ అయ్యింది. కాగా వేలంలో అమ్ముడు కావడంతో ప్రస్తుతం ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. గతంలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే మొట్టమొదటి ట్వీట్‌ను కూడా ఎన్ఎఫ్‌టి పద్ధతిలో 2.9 మిలియన్ డాలర్లకు విక్రయించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement