బైక్ నడిపేవారికి హెల్మెట్ అవసరం ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా ప్రమాదం జరిగినపుడు మన ప్రాణాలను కాపాడేందుకు హెల్మెట్ పనిచేస్తుంది. కేవలం బైకు నడిపేవారు మాత్రమే కాకుండా వెనకాల కూర్చునే వారు కూడా హెల్మెట్ ధరించటం అత్యంత అవసరం. బైకుపై ఉన్న ఇద్దరూ హెల్మెట్ ధరించటం వల్ల ఎంత మేలో తెలియాలంటే నగరంలో జరిగిన ఓ ప్రమాదం గురించి తెలియాల్సిందే. కొద్దిరోజుల క్రితం ఓ ఇద్దరు వ్యక్తులు రోడ్డును దాటుతున్నారు. సరిగ్గా డివైడర్ను చేరే సమయానికి ఓ బైక్ వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు పాదచారులు, బైకు నడుపుతున్న యువకుడు, వెనకాల కూర్చున్న యువతి కిందపడ్డారు. ఆ యువతి తల నేరుగా డివైడర్ను తగిలింది.
అయితే ఆమె హెల్మెట్ ధరించి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న వివరాలు తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్ వేదికగా స్పందించారు. ‘బైకు నడుపుతున్న వ్యక్తి, వెనకాల కూర్చున్న అమ్మాయి ఎందుకు హెల్మెట్ ధరించారు?’ అని ప్రశ్నిస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.