లాక్ డౌన్ పేరుతో కొందరు అధికారులు రెచ్చిపోతున్నారు. సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. పోలీసులు లాఠీలకు పని చెప్తుంటే.. ఇతర అధికారులు చేతులకు పనిచెప్తున్నారు. తాజాగా ఓ వ్యక్తిని కలెక్టర్ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఛత్తీస్ గఢ్ సూరజ్ పూర్ జిల్లాకు చెందిన వ్యక్తికి అత్యవసరంగా మెడిసిన్స్ అవసరమయ్యాయి. మందులు కొనడానికి వెళ్లాడు. అయితే కలెక్టర్ రణ్ బీర్ శర్మ, పోలీసులు అతడ్ని అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. ఆ వ్యక్తి మందులకు సంబంధించిన చీటీలు చూపిస్తున్నా… ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టి కలెక్టర్ చెంప చెల్లుమనిపించాడు. పోలీసులను కూడా కొట్టమని ఆదేశాలిచ్చాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు లాఠీలతో చావబాదారు. కలెక్టర్ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైగా అందులో ఉంది మైనర్ అని ప్రచారం జరగడంతో ఆయన్ను సస్పెండ్ చేయాలని హ్యాష్‌ట్యాగ్ లతో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. అయితే ఈ ఘటనలో ఆ వ్యక్తిపైనే కేసు నమోదైంది. అతను మైనర్ కాదని.. బైక్ ఆపమన్నా వినకుండా వేగంగా వెళ్లినందుకు కేసు పెట్టామని పోలీసులు చెప్పారు. కలెక్టర్ రణ్ బీర్ కూడా ఈ ఘటనపై స్పందించారు. తాను కావాలని చేయలేదని.. సారీ చెప్పారు. తన కుటుంబం కూడా కరోనా బారినపడిందని.. అయినా డ్యూటీ చేస్తున్నానని వివరించారు.