ప్రభన్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో వినాయకచవితి సందడి మొదలైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ దాకా నిర్వహించే నవరాత్రోత్సవాలకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. వినాయక ప్రతిమలను ప్రతిష్టించడానికి నగరవ్యాప్తంగా వేలసంఖ్యలో మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం నుంచే నవరాత్రోత్సవాలు ప్రారంభం కానుండడంతో నిర్వాహకులు దాదాపు పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది తమకు నచ్చిన వినాయక ప్రతిమలను కొనుగోలు చేసుకున్నారు. ప్రధానంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి హెచ్‌ఎండీఏతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తుండగా, మరో వైపు అందమైన రంగులతో ముస్తాబు చేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు సైతం భారీగానే డిమాండ్ ఉంది. విగ్రహాల కొనుగోలుకు కేవలం హైదరాబాద్ వాసులే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న కొనుగోలుదారులతో నగరం సందడిగా మారింది. ప్రధానంగా దూల్‌పేట, ఎల్‌బీనగర్, నాగోల్, ఉప్పల్, మియాపూర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో సందడి పెరిగింది.
ఇదిలా ఉండగా మరోవైపు వినాయక విగ్రహాలను ప్రతిష్టించడానికి వర్షం వచ్చినా ఇబ్బందులు లేకుండా ఉండేలా నిర్వాహకులు మండపాలను ఏర్పాటు చేశారు. విద్యత్ వెలుగుల కోసం చాలామంది ఆయా ప్రాంతాలకు చెందిన విద్యుత్ అధికారులను సంప్రదిస్తు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ మహా వినాయకుని వద్ద వేలాదిగా తరలి వచ్చే భక్తులతో తొక్కిసలాట జరగకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. భక్తుల కోసం బారీకేడ్లు ఏర్పాటు చేశారు. మండపాలకు సీరియల్ లైట్లు వేసి రంగురంగుల వెలుగులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.