చంద్రయాన్ మిషన్‌లో భాగంగా జాబిల్లిపైకి చేరుకొని, అప్పగించిన పని విజయవంతంగా పూర్తి చేసి శాశ్వతంగా నిద్రావస్థలోకి చేరుకున్న ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌కు జాబిల్లి ఉపరితలాన్ని నిరంతరాయంగా తాకుతుండే మైక్రోమెటియోరాయిడ్‌ల నుంచి ముప్పు ఉంటుందని ఇస్రో ఉన్నతాధికారులు తెలిపారు. గతంలో అపోలో అంతరిక్ష నౌకతో పాటుగా జాబిల్లికి ఉద్దేశించిన పలు అంతరిక్ష నౌకలు వాటి పాలపడ్డాయని చెప్పారు.
ఇదే విషయమై మణిపూర్ సెంటర్ ఫర్ నేచురల్ సైన్సెస్ డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ పి.శ్రీకుమార్ మాట్లాడుతూ జాబిల్లిపై ఎలాంటి పర్యావరణం లేదా ఆక్సిజన్ లేని కారణంగా విక్రమ్, ప్రజ్ఞాన్‌లకు తుప్పు పట్టే ముప్పు లేదని తెలిపారు. కానీ జాబిల్లి ఉపరితలంపై అదేపనిగా దాడి చేస్తుండే మైక్రోమెటియోరాయిడ్‌ల ప్రభావానికి ల్యాండర్, రోవర్‌లు దెబ్బ తినవచ్చని తెలిపారు. అలాగే సూర్యుడి నుంచి నిరంతరం వెల్లువెత్తే రేడియేషన్ కూడా ఆ రెండింటిపై ప్రభావం చూపుతుందని చెప్పారు.
అపోలో అంతరిక్ష నౌక నుంచి జాబిల్లిపైకి అడుగుపెట్టిన వ్యోమగాములు అక్కడి వదిలివెళ్లిన లూనార్ రిఫ్లెక్టోమీటర్లపై ధూళి పొరలు కమ్ముకొని ఉన్నాయని తెలిపారు. అయితే నిద్రావస్థలోకి చేరుకోవడానికి ముందు 14 రోజుల మిషన్‌లో భాగంగా ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ వాటికి అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేశాయనే సంతృప్తితో తాము ఉన్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.