తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతోందన్నారు విజయశాంతి. టెస్టుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించింది. అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదని విమర్శించారు. విద్యాసంస్థలను మాత్రం మూయించి సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్లు, క్లబ్లు, గుంపులు గుంపులుగా తీరుగుతున్న జనాన్ని కట్టడి చేయడం, బెడ్స్ కొరత గురించి న్యాయమూర్తులడిగిన ప్రశ్నలకు నీళ్ళు నమిలారు. సరైన సమాచారం లేని ప్రభుత్వ నివేదికల్లోని లోపాలపై హైకోర్టు నిలదీసింది.
సరిగ్గా కిందటేడాది ఏం తప్పులు జరిగాయో… అవే ఇప్పుడూ పునరావృతం అవుతున్నందువల్లే రాష్ట్రంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిందనే విషయాన్ని సర్కారు గ్రహించడం లేదు. గుణపాఠం నేర్చుకోవడం లేదు. కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ గారు అంతకుముందు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించి, సభల్లో పాల్గొన్న ఫొటోలు మీడియాలోను, సోషల్ మీడియాలోను చక్కర్లు కొడుతున్నాయన్నారు. పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆరెస్ నాయకులు వారి అధినేత బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారారని అన్నారు.
తెలంగాణలో మాస్కులు ధరించనివారికి వేలకు వేలు ఫైన్లు వేస్తున్నారు. ఆ ఫైన్ ఏదో మాస్కు ధరించని కేసీఆర్ గారికి, ఆ పార్టీ నేతలకు కూడా వేసి ఉంటే పాపం ఆయన జాగ్రత్త పడేవారు కదా అనిపిస్తోందన్నారు. ఇక రాత్రివేళ కర్ఫ్యూ పెట్టి చేతులు దులుపుకున్నారు.. కానీ పగటి పూట ఎలాంటి నియంత్రణలూ లేకుండా ఈ ప్రభుత్వం సాధించదలుచుకుంది ఏమిటో అర్థం కావడం లేదు. ఈ నేతలు, ఈ సర్కారును నమ్ముకుంటే ఇంతే సంగతులని జనానికి బాగా అర్థమయ్యేలా చేస్తున్నారన్నారు విజయశాంతి.