Friday, November 22, 2024

డోలో వేసుకునేదానికి కేసీఆర్ యశోదాకు ఎందుకు వెళ్లారు?: విజయశాంతి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి విమర్శలు చేశారు. హైదరాబాదు జూబ్లీహిల్స్‌లోని శ్రీరాంనగర్‌లో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ సెంటర్‌ను శనివారం నాడు విజయశాంతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇక్కడ కరోనా వ్యాక్సినేషన్ తీరుతెన్నులను గమనించేందుకు వచ్చామని వెల్లడించారు. రోజుకు 200 మంది వరకు ఇక్కడ వ్యాక్సిన్ పొందుతున్నట్టు అధికారులు చెప్పారని, కొవిషీల్డ్ ఇస్తున్నట్టు వెల్లడించారని విజయశాంతి తెలిపారు. అయితే సిరంజిలు ప్రజలే స్వయంగా తెచ్చుకోవాలని వ్యాక్సిన్ సిబ్బంది చెప్పడం సరికాదని, ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాలని హితవు పలికారు. ఆఖరికి సిరంజిలు కూడా ప్రజలే తెచ్చుకునేట్టయితే ఈ ప్రభుత్వం ఉన్నది ఎందుకని ప్రశ్నించారు.

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా అందించాలని ప్రధాని మోదీ ప్రకటించారని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని, తమవంతు విధి నిర్వహణ సక్రమంగా చేయాలని స్పష్టం చేశారు. కరోనా వస్తే డోలో మాత్రలు వేసుకుంటే సరిపోతుందని చెప్తున్న కేసీఆర్… తనకు కరోనా వస్తే యశోదా ఆసుపత్రిలో ఎందుకు చేరారని ఆమె నిలదీశారు. కరోనా సోకినప్పుడు సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ బాధ్యతగా తాను కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, కేసీఆర్ బాధ్యతగా వ్యవహరించి ఉంటే తెలంగాణలో ఇంతమంది ప్రాణాలు పోయేవి కావని విజయశాంతి ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement