న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో వెనుకబడిన తరగతులకు జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతి, సంక్షేమం న్యాయబద్ధంగా జరిగేలా చూడాలంటే బీసీల విద్యా, సామాజిక గణన జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. ఈ మేరకు అవసరమైన రాజ్యాంగ సవరణలు ప్రతిపాదిస్తూ శుక్రవారం రాజ్యసభలో ఆయన ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. కొత్తగా ఆర్టికల్ 342(బీ)ని చేర్చడం ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం సుంకాలు, సర్చార్జీల రూపంలో వసూలు చేస్తున్న రెవెన్యూలో రాష్ట్రాలకు కూడా వాటా ఇచ్చేలా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 270, 271, 280ను సవరించాలని కోరుతూ విజయసాయి రెడ్డి మరో రాజ్యాంగ (సవరణ) బిల్లు, 2022ను సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ జనాభా 68 కోట్లు ఉన్న సమయంలో వెనుకబడిన తరగతుల వారి సంఖ్య 52 శాతం ఉన్నట్లుగా 1980లో మండల్ కమిషన్ నిర్ధారించిందని తెలిపారు. ఇప్పుడు దేశ జనాభా 138 కోట్లకు చేరిందని, అయినప్పటికీ ఇందులో బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా తెలియదని అన్నారు. విద్యా, ఆర్థిక, సామాజికపరంగా బీసీల ప్రస్తుత స్థితిగతులు స్పష్టం కావాలంటే వెనుకబడిన కులాల లెక్కలు సేకరించడం అనివార్యమని అన్నారు. అప్పుడే వారి అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు తదనుగణంగా విధానాలకు రూపకల్పన చేసి వాటిని విజయవంతంగా అమలు చేయగలుగుతాయని అన్నారు.
జనాభా ప్రాతిపాదికపై బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి రాజ్యసభ జీరో అవర్లో విజయసాయి రెడ్డి విజ్ఞప్తి
వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు కల్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్లో శుక్రవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దశాబ్దాలుగా తీవ్ర అన్యాయానికి గురైన వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపదికపై విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థల్లో రిజర్వేషన్ కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేయడమే వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దినట్లు అవుతుందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 75వ సంవత్సరం ఇది. ఈ 75 ఏళ్ళలో దేశం పలు రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించింది. కానీ వెనుకబడిన తరగతుల అభ్యున్నతి విషయంలో మాత్రం స్వతంత్ర భారతావని విఫలమైందన్న విషయం కఠోర వాస్తవమని విజయసాయి రెడ్డి అన్నారు.
అన్ని రంగాలలో తమకు సమాన అవకాశాలు ఉండాలన్న వెనుకబడిన తరగతుల ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష మాత్రం ఈనాటికీ నెరవేరలేదని అన్నారు. దేశంలో షెడ్యూల్డు కులాలు, తెగల జనాభాను లెక్కించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. కానీ వెనుకబడిన కులాలను అన్యాయంగా కుల గణన నుంచి విస్మరించి జనాభా ప్రాతిపదికపై వారికి రిజర్వేషన్ కల్పించలేకపోయామని తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలో వారికి న్యాయంగా దక్కవలసిన రిజర్వేషన్ దక్కలేదని విజయసాయి రెడ్డి గుర్తు చేశారు. దేశ జనాభాలో వెనుకబడిన తరగతులు ప్రజలు 50 శాతానికి పైగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్ 27 శాతానికే పరిమితమైంది. రిజర్వేషన్ సీలింగ్ 50 శాతం మించి ఉండొచ్చని ఈ గరిష్ట పరిమితిని సవరించడం రాజ్యాంగ మౌలిక సూత్రాల ఉల్లంఘన ఏమాత్రం కాబోదంటూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయ స్థానం కూడా అభిప్రాయపడిందని విజయసాయి రెడ్డి తెలిపారు.
ఈ నేపధ్యంలో వెనుకబడిన తరగతులకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించడంలో ప్రభుత్వానికి న్యాయపరమైన అవరోధాలు కూడా ఏమీ ఉండబోవు. కాబట్టి బీసీలకు విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగం, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో వారి జనాభాకు తగినట్లుగా రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన అని చర్యలు చేపట్టవలసిందిగా విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.