Tuesday, November 26, 2024

Delhi | గిరిజనుల అభ్యున్నతే  ప్రభుత్వ ధ్యేయంరాజ్యసభలో స్పష్టం చేసిన విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ సభ్యులు రాజ్యసభలో విజయసాయి రెడ్డి నొక్కి చెప్పారు. షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ ఆర్డర్‌ ఐదవ రాజ్యాంగ సవరణ బిల్లుపై మంగళవారం సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా గిరిజనులకు మేలు చేకూర్చే ఎలాంటి చర్యలనైనా వైఎస్సార్సీపీ సమర్ధిస్తుందని, అందుకు సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

అంతకుముందు సభలో టీడీపీ సభ్యుడు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత గిరిజనుల అభ్యున్నతి కోసం చేపట్టిన పలు చర్యలను ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోకు మంజూరు చేసిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని గిరిజన నివాసిత ప్రాంతంలోనే నెలకొల్పేందుకు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారని అన్నారు. ఇందుకోసం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన వందలాది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందని, గిరిజన యూనివర్శిటీ భవనాలు, క్యాంపస్ నిర్మాణం ప్రారంభమైందని విజయసాయి రెడ్డి చెప్పారు.

- Advertisement -

అలాగే అనాదిగా వైద్య, ఆరోగ్య సౌకర్యాలకు నోచుకోని గిరిజనుల కోసం ఏజెన్సీ ప్రాంతమైన పాడేరులో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితో కూడిన వైద్య కళాశాల నిర్మాణానికి పూనుకున్నారు. పోడు వ్యవసాయమే గిరిజనుల జీవనాధారం అయినందున అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద పోడు సాగు చేసే భూములకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమానికి వైఎస్ జగన్‌ శ్రీకారం చుట్టారన్నారు. 1 లక్షా 30 వేల ఎకరాల్లో 55 వేల మంది గిరిజనులకు పట్టాల పంపిణీ జరిగిందని విజయసాయి రెడ్డి ఉద్ఘాటించారు. అయితే  ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ గిరిజను సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని ఆరోపించారు.

ఎస్టీ జాబితాలోకి వాల్మీకి, బోయ కులాలను చేర్చాలి

మైదాన ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనుకబడిన వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఈ ఏడాది మార్చిలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందని, దానిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకోవలసి ఉందని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డి కింద ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించారని, దాని ప్రకారం ఎస్టీ జాబితాలోని కులాలకు 7 శాతం రిజర్వేషన్‌ కల్పించారని తెలిపారు. కొత్తగా ఏదైనా కులాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల జానాభా ప్రాతిపదికపై రిజర్వేషన్‌ పరిమితిని పెంచాల్సి ఉంటుంది. కాబట్టి అప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న కులాలకు ఎలాంటి అన్యాయం జరగదని ఆయన అన్నారు.


మహిళలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని వైఎస్సార్సీపీ ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తోందని తెలిపారు. లోక్‌‌సభ నుంచి మొదలు పెట్టి స్థానిక సంస్థల వరకు మహిళలకు 50 శాతం స్థానాలను రిజర్వ్‌ చేయడం వలన గిరిజనులకు తమకు కేటాయించిన 7 శాతం రిజర్వేషన్‌ కాకుండా అదనంగా చట్ట సభల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కుతుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement