బెంగుళూరు – గుండె సంబంధిత వ్యాధితో బెంగుళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యంపై వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ఆరా తీశారు. నేడు బెంగుళూరు వెళ్లిన విజయసాయి డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తారకరత్న భార్య అలేఖ్యకి విజయసాయి స్వయంగా మేనమామ కావడంతో ఆ బంధుత్వంతో ఆయన అక్కడికి వెళ్లారు. అరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు బంధువుల నుంచి సేకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
గుండెపోటు వచ్చినరోజు 45 నిమిషాలు రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల మెదడులో పై భాగం దెబ్బతిన్నదని వెల్లడించారు. దానివలన నీరు చేరి మెదడు వాచిందన్నారు. వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు తెలిపినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. కాగా, నందమూరి బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నకు అన్ని వైద్యసదుపాయాలు కల్పిస్తున్నారని విజయసాయి రెడ్డి ప్రశంసించారు. బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మెదడు పై భాగం దెబ్బతినడంతో కొన్ని అవయవాలు కొంత యాక్టీవ్ గా పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారని వివరించారు. గుండె బాగానే పనిచేస్తుందని.. రక్త ప్రసరణ కూడా బాగుందని.. తారకరత్న త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. డాక్టర్లు చాలా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారని, త్వరలోనే తారకరత్న డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.