హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానాలకి నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసేందుకు తెలంగాణ పశుసంవర్ధక శాఖ విజయ డెయిరీ కంపెనీ సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ తెలిపారు.
ఈ మేరకు ఆయన (శనివారం) లేఖ ద్వారా టీటీడీ కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావుకు ప్రభుత్వ ప్రతిపాదనను తెలియజేశారు. తెలంగాణ విజయ డెయిరీ కంపెనీకి దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో మంచి గుర్తింపు ఉందని, వినియోగదారులకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసిన చరిత్ర ఉందని లేఖలో పేర్కొన్నారు.
విజయ డెయిరీ ఉత్పత్తులలో నాణ్యతను నిర్ధారించడంతో పాటు, లక్షలాది మంది పాడి రైతుల జీవనోపాధికి సంస్థ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి విజయ డైరీ సంస్థ సన్నద్దతను తెలియజేశారు.
విజయ డెయిరీ ప్రభుత్వ సంస్థ అయినందున సరఫరాల స్వచ్ఛత, నాణ్యత, ధరలపై పూర్తి పారదర్శకత ఉంటుందని ఆయన తెలిపారు. ఆలయానికి, భక్తులకు సేవలందించేందుకు అవకాశం కల్పించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి జె.శ్యామలరావుకు రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ విజ్ఞప్తి చేశారు.