Friday, November 22, 2024

కోవిడ్‌ పంజా.! అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ.. కోవిడ్‌ నిబంధనల అమలుకు కఠిన చర్యలు

వికారాబాద్‌, ప్రభన్యూస్ : జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఒకవైపు కోవిడ్‌.. మరోవైపు ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తితో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వం సైతం వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. సోమవారం వరకు ఉన్న ఆంక్షలను ఈనెల 20 వరకు పొడగించారు. మరోవైపు వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. జిల్లా అంతటా కోవిడ్‌ పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు. కోవిడ్‌ కేసుల సంఖ్య పెరిగితే ఎదుర్కొనేందుకు వైద్య శాఖ సిద్దమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో వసతులను పెంచారు. ఇక కోవిడ్‌ కట్టడికి ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలను జిల్లాలో కఠినంగా అమలు చేసేందుకు పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలో కోవిడ్‌ పంజా విసరడంతో ప్రజలలో ఆందోళన మరింత పెరిగింది.

కోవిడ్‌పై పోరుకు ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. జిల్లా యంత్రాంగం మొత్తం కోవిడ్‌ కట్టడికి రంగంలోకి దిగింది. ఇక జిల్లాలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. చాలా కేసులు వెలుగులోకి రావడం లేదు. జిల్లాలోని తాండూరు, కోడంగల్‌ లాంటి ప్రాంతాలు రాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. ఈ ప్రాంతాలకు నిత్యం పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చివెళుతున్నారు. పొరుగు రాష్ట్రం అయిన కర్ణాటకలో వైరస్‌ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీని ప్రభావం జిల్లాలోని తాండూరు ప్రాంతంపై అధికంగా కనిపిస్తోంది. తాండూరులో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని కోవిడ్‌ యాక్టివ్‌ కేసులలో అధికంగా తాండూరులోనే ఉన్నాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాలలో కూడా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. సంక్రాంతి పర్వదినం వస్తుండడంతో మార్కెట్‌లకు ప్రజలు పోటెత్తుతున్నాయి. దీంతో కోవిడ్‌ కేసులు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

జిల్లాలో ప్రస్తుతం ప్రతిరోజు 500 వరకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులలో కోవిడ్‌ పరీక్షలు జరుగుతున్నాయి. కోవిడ్‌ పరీక్షల సంఖ్యను ప్రతిరోజు రెట్టింపు చేసేందుకు వైద్యఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమాచారం ప్రకారం ప్రస్తుతం జిల్లాలో కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 23కు పెరిగింది. అయితే చాలా మంది ప్రైవేటులో పరీక్షలు చేసుకోవడంతో వాస్తవ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తెలియడం లేదు. కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారు ప్రైవేటుగానే వైద్య తీసుకుంటూ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. జిల్లాలో ప్రతిరోజు కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తుండడంతో అధికారులు కట్టడి చర్యలను ముమ్మరం చేశారు.

వరుసగా సెలవులు రావడం..సంక్రాంతి పండగ వస్తుండడంతో ప్రజలు మార్కెట్‌లకు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు పండగ కొనుగోళ్ల నిమిత్తం మార్కెట్‌లకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాలలోని మార్కెట్‌లలో రద్దీ కనిపిస్తోంది. వచ్చే నాలుగు రోజులలో మార్కెట్లు మరింత రద్దీగా ఉంటాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తికి ఇది అనుకూల సమయంగా వైద్య ఆధికారులు పేర్కొంటున్నారు. దీనిని నివారించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. బహిరంగ ప్రదేశాలలో ప్రజలు ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని ఉన్న ఆదేశాలను కఠినంగా అమలు చేసేందుకు పోలీసుశాఖ సిద్దమైంది. ఇక వ్యాపారు దుకాణాల వద్ద మాస్క్‌ లేని వారిని అనుమతించరాదని స్పష్టం చేస్తున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు కోవిడ్‌ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఇప్పటికే వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో వైద్య శాఖతో పాటు ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement