న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కోవిడ్-19 సహా దేశంలో పెరుగుతున్న సరికొత్త ఇన్‌ఫ్లూయెంజా కేసుల నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. పెరుగుతున్న కేసులను గమనిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శులు రాజేశ్ భూషణ్, డా. రాజీవ్ బహల్ పేరిట రాష్ట్రాల వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ విడుదలైంది. ఫిబ్రవరి రెండవ వారం నుంచి దేశంలో క్రమ క్రమంగా కోవిడ్-19 కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా ఈ పెరుగుదల కేరళ(26.4%), మహారాష్ట్ర (21.7%), గుజరాత్ (13.9%), కర్ణాటక (8.6%), తమిళనాడు (6.3%) కనిపించిందని వెల్లడించింది.
అయితే కొత్తగా నమోదవుతున్న కోవిడ్-19 కేసుల్లో మరణాల సంఖ్య, ఆస్పత్రుల్లో చేరాల్సిన స్థాయి సీరియస్ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, దేశ ప్రజల్లో దాదాపుగా అందరికీ కోవిడ్-19 టీకాలు అందడం వల్ల తీవ్రత తక్కువగా కనిపిస్తోందని కేంద్రం పేర్కొంది. అలాగే ప్రతియేటా జనవరి నుంచి మార్చి నెల మధ్యలో, అలాగే ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో కనిపించే ఇన్‌ఫ్లూయెంజా ఏ (H1N1), ఇన్‌ఫ్లూయెంజా ఏ (H3N2) వైరస్ కారణంగా వ్యాప్తి చెందే వ్యాధుల గురించి కేంద్రం ప్రస్తావించింది.
కోవిడ్-19 తరహాలో ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి లక్షణాలు, వైరస్ వ్యాప్తి చెందే లక్షణాలు ఒకేలా ఉంటాయని కేంద్రం రాష్ట్రాలకు గుర్తుచేసింది. వ్యాధి లక్షణాలను చూసి ఏ వైరస్ కారణంగా రోగి ఇబ్బందిపడుతున్నారో గుర్తించడంలో సందిగ్ధత నెలకొంటుందని, అయితే ఈ రెండింటినీ కొన్ని సాధారణ జాగ్రత్తలతో నియంత్రించవచ్చని కేంద్రం సూచించింది. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని తెలిపింది. కోవిడ్-19తో పాటు ప్రతియేటా కొన్ని సీజన్లలో వచ్చే ఫ్లూ జ్వరాలపై కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందని, వాటిని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలని ఆదేశించింది.
ఈ వ్యాధులకు కారణమయ్యే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రజలందరినీ ఆ మేరకు అప్రమత్తం చేయాలని కేంద్రం సూచించింది. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించేలా సూచనలు జారీ చేయాలని, ఆస్పత్రుల్లో అటు రోగులు, ఇటు వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, హ్యాండ్ సానిటైజర్ల వినియోగంతో పాటు పబ్లిక్ ప్రదేశాల్లో ఉమ్మి వేయకుండా కట్టడి చేయాలని కూడా సూచించింది. లక్షణాలు గుర్తించిన వెంటనే ల్యాబ్ పరీక్షలు చేయించుకునేలా ప్రజల్ని అప్రమత్తం చేయాలని తెలిపింది.
భారీస్థాయిలో మాక్ డ్రిల్ రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్
ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. తద్వారా వైద్య వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను గుర్తించి, ఆ మేరకు దిద్దుబాటు చేసుకోవచ్చని అభిప్రాయపడింది. ఈ మాక్ డ్రిల్ కు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సోమవారం సాయంత్రం గం. 4.30 నుంచి 5.30 మధ్య అన్ని రాష్ట్రాలతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వివరిస్తామని కేంద్రం తెలిపింది.
గత కొన్ని వారాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల మేరకు దేశంలో కోవిడ్-19 టెస్టులు జరగడం లేదని కేంద్రం పేర్కొంది. కోవిడ్-19 కొత్త వేరియంట్లను గుర్తించడం, కట్టడి చేయడం కోసం టెస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని, రాష్ట్రాలు ఎక్కువగా యాంటీజెన్ టెస్టులపై ఆధారపడుతున్నాయని, వాటికి బదులుగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులను పెంచాలని సూచించింది. కోవిడ్ హాట్‌స్పాట్లను గుర్తించడం కోసం టెస్టులు కీలకమని కేంద్రం గుర్తుచేసింది.