గవర్నమెంట్ ఆఫీసులు అంటేనే లంచాలకి నిలయాలనే నానుడి ఉంది. అందరూ అలాగే ఉండాలన్న రూల్ లేదు..ఇప్పుడదే విషయాన్ని ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఎక్కడా అనుకుంటున్నారా కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుందీ సంఘటన. వినడానికి వింతగా ఉన్నా..ఈ ఉద్యోగులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లంచం అనే మాట ప్రతిచోటా వినిపిస్తూనే ఉంది. లంచం ఇవ్వనిదే ప్రభుత్వంలోని ఏశాఖలోనూ ఫైలు కదలదనే విధానం దేశంలోని ప్రతి చోటా కనిపిస్తోంది.
ఇందుకు కర్ణాటక రాష్ట్రం ఏం ప్రత్యేకం ఏమీ కాదు. వీటికి భిన్నంగా రాష్ట్ర సచివాలయ కేంద్రం విధానసౌధలో ఇకపై మేం లంచాలు తీసుకోం అంటూ ఉద్యోగులు తీర్మానించారు. కాగా విధానసౌధలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఛీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ.. మన దేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక, అభివృద్ధికి లంచాలు, అవినీతి ఒక అడ్డంకి మారిందని నమ్ముతున్నాను. ఈ మేరకు ఉద్యోగులు ప్రతిజ్ఞని ఇలా చేశారు. జీవితంలో అన్ని రంగాలలోను నిజాయితీ, చట్ట నిబంధనలు పాటిస్తానని, లంచం తీసుకునేది లేదని, ఎట్టి పరిస్థితిలోను ఇచ్చేది లేదు. అన్ని పనులు ప్రామాణికత, పార దర్శకత రీతిలో నిర్వహిస్తానని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తాను. వ్యక్తిగతంగా నిబద్దత ప్రదర్శించడం ద్వారా ఆదర్శంగా ఉంటాను. ఎటువంటి అవినీతి విషయమైనా సంబంధిత సంస్థకు సమాచారం ఇస్తానంటూ శపథం చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు.. లంచాలకు కేంద్రాలు అనే నానుడిని రూపు మాపేందుకు విధానసౌధ ఉద్యోగులు తీసుకున్న నిర్ణయం స్వాగతించే విషయమని పలువురు పాలకులు, ప్రజా సంఘాలు అభిప్రాయపడ్డాయి. ప్రతిజ్ఞ చేశారు సరే..మరి ఏ మేరకు నిబద్ధతతో ఉంటారో చూడాలి. ఆ మాట పక్కన పెడితే ఈ రకమైన ప్రతిజ్ఞ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలని రూపుమార్చడానికి వారు చేసిన ప్రతిజ్ఞ గర్వించదగ్గదనే మాటలు వినిపిస్తున్నాయి.