న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 సీట్లు తామే గెలుచుకుంటామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) అన్నారు. ఢిల్లీ వచ్చిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి నేతలతో ఎంపీ నామ నివాసంలో సమీక్షా సమావేశం జరిపిన నేతలిద్దరూ అనంతరం ఈ విషయం చెప్పారు. ఖమ్మం జిల్లాలో ముఖ్య నేతలు ఎవరికివారుగా వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లా నుంచి వచ్చిన నేతలకు ముగ్గురు ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారధి రెడ్డి కలిసి ఆతిథ్యమిచ్చారు.
జిల్లా నేతలకు పార్లమెంట్ పాసులు ఏర్పాటు చేసి సమావేశాలు వీక్షించే అవకాశం కల్పించారు. రాష్ట్రపతి భవన్‌తో పాటు ఢిల్లీలోని సందర్శనీయ ప్రదేశాలు చూసేందుకు ఏర్పాట్లు చేశారు. భోజన, వసతి సదుపాయాలతో పూర్తిస్థాయి ఆతిథ్యమిచ్చిన జిల్లా ఎంపీలు.. చివరగా వారికి ఎన్నికల రణక్షేత్రంలో యుద్ధానికి సిద్ధం కావాలంటూ దిశానిర్దేశం చేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి వంటి ముఖ్య నేత పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో.. జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీలు కలసికట్టుగా జిల్లా నాయకత్వాన్ని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ ఎన్నికలకు సిద్ధం చేయడం ఆసక్తికరంగా మారింది.
జిల్లాలో తుమ్మల నాగేశ్వర రావు, పువ్వాడ అజయ్, తాతా మధువంటి నేతలు ఎవరికివారుగా తమ తమ వర్గాలను ప్రోత్సహిస్తున్నట్టు కథనాలు ఇప్పటికే వచ్చాయి. అయితే వారికి భిన్నంగా నామ నాగేశ్వరరావు జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలందరినీ ఢిల్లీకి పిలిపిస్తూ, వారికి జాతీయ స్థాయి రాజకీయాలపై అవగాహన కల్పిస్తూ.. వారు లేవనెత్తే సమస్యలను పరిష్కరిస్తున్నారు. కొందరికే కాకుండా అందరివాడిగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. నామాకు చేదోడువాదోడుగా వద్దిరాజు రవిచంద్ర నిలుస్తున్నారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నామా నాగేశ్వర రావు.. జిల్లా నేతలు జాతీయ రహదారులకు సంబంధించి ఎదురవుతున్న కొన్ని సమస్యలు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్ వే కు కనెక్టివిటీ లేకుండా పోయిందని, ఆ విషయంపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఖమ్మం జిల్లా రూపురేఖలు మారిపోయాయని చెప్పారు.
ఒకప్పుడు తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి ఉండేదని, తాను తన తండ్రి నామ ముత్తయ్య పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవాడినని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు ప్రతి ఇంటికీ పైప్ లైన్ ద్వారా సురక్షిత తాగునీరు చేరుతోందని.. ఇది కేవలం ఒక రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక మార్పు మాత్రమే కాదని, ప్రతి రంగంలోనూ యావత్ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్న ప్రజలు బీఆర్ఎస్ వెంట నిలుస్తారన్న ధీమా వ్యక్తం చేశారు.
మరో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. జిల్లాలో అసలు తమకు పోటీయే లేదని అన్నారు. కాంగ్రెస్ నామమాత్రంగా పోటీలో ఉంటుంది తప్ప జిల్లాలోని 10 నియోజకవర్గాలూ ఈసారి బీఆర్ఎస్ గెలుచుకుంటుందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న పథకాలను చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు తమకు కూడా ఆ పథకాలు కావాలని ఆందోళన చేస్తున్నారంటే తెలంగాణ ఏ రీతిన ముందుకు దూసుకెళ్తుందో అర్థమవుతుందని రవిచంద్ర అన్నారు. కానీ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ మాత్రం కనీసం పార్లమెంటును సజావుగా నిర్వహించలేకపోతోందని, తాను ఎంపీగా ఎన్నికైన తర్వాత ఒక్కసారి కూడా అర్థవంతమైన చర్చ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాన మంత్రి నోరు విప్పేలా చేయగలిగామని రవిచంద్ర తెలిపారు.