Saturday, November 23, 2024

TG | ‘ప్రజాపాలన’ విజయోత్సవాలు అదరాలి : సీఎం రేవంత్‌

ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విజయోత్సవ వేడుకలను అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని సూచించారు.

ప్రజా పాలన – విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన మహబూబ్​నగర్‌లో రైతులకు అవగాహన కల్పించే రీతిలో రైతు సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల‌ని అన్నారు.

డిసెంబరు 1వ తేదీ నుంచి శాఖల వారీగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ వారంలో జరిగేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ నిర్వహించాలని… ఆ వేదికపై గ్రూప్ 4తో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన 9వేల మందికి నియామక పత్రాలు అందించాలన్నారు.

ఇక డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొనేలా ప్రజా పాలన విజయోత్సవ ఉత్సవాలు నిర్వహించాలని రేవంత్ అన్నారు. ఈ మూడు రోజుల్లో హైదరాబాద్‌లోని సచివాలయం, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మూడు రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలతో పాటు మ్యూజికల్ షోలు, ఎయిర్ షో, కన్నుల పండువగా డ్రోన్ షోలు నిర్వహించాలన్నారు.

రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని చెప్పారు. డిసెంబర్‌ 9వ తేదీన సెక్రెటేరియట్‌ ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆ రోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులను, మేధావులను, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు.

- Advertisement -

ప్ర‌తి నియోజకవర్గానికో వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహ్వానించి… లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్‌రెడ్డి, శ్రీనివాసరాజు, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement