Sunday, September 8, 2024

మూడు దేశాల పర్యటనలో ఉపరాష్ట్రపతి…

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు మూడు దేశాల పర్యటనకు సోమవారం బయలుదేరి వెళ్లారు. సోమవారం నుంచి జూన్ 7 వరకు జరిగే ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతి గెబోన్, సెనెగల్, కతార్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, పార్లమెంట్ సభ్యులు సుశీల్ కుమార్ మోదీ (రాజ్యసభ), విజయ్ పాల్ సింగ్ తోమర్ (రాజ్యసభ), పి.రవీంద్రనాథ్ (లోక్‌సభ) కూడా ఉన్నారు. ఈ పర్యటనలో మూడు దేశాలతో కీలకమైన అంశాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు జరగనున్నాయి. ఈ మూడు దేశాల్లో భారతదేశ ఉపరాష్ట్రపతి పర్యటించడం ఇదే ప్రథమం కాగా, గెబాన్, సెనెగల్ దేశాల్లో భారతదేశం ఉన్నతస్థాయి చర్చలు జరపడం కూడా ఇదే తొలిసారి. ఉపరాష్ట్రపతి చేపట్టిన ఈ పర్యటన ద్వారా పశ్చిమ ఆఫ్రికా దేశాలతో భారతదేశ సంబంధాల్లో మరింత పురోగతి కనిపించనుంది. కతార్‌తో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలకు 50 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటన అనంతరం భారత్ – కతార్ దేశాల సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. మే 30 నుంచి జూన్ 1 వరకు గెబాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని శ్రీమతి రోస్ క్రిస్టైన్ ఒసుంకా రాపొండా, అధ్యక్షుడు అలీ బోంగో ఒండిబాతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఉపరాష్ట్రపతి చర్చలు జరపనున్నారు. అనంతరం గెబాన్ లోని భారత సంతతి పారిశ్రామిక వేత్తలతో, అక్కడి భారత సంతతి ప్రజలతో ఉపరాష్ట్రపతి సంభాషిస్తారు.

జూన్ 1 నుంచి 3 వరకు సెనెగల్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు మేకీ సాల్, సెనెగల్ నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడు మౌస్తఫా నియాసీతోపాటు ఇతరులతో ఉపరాష్ట్రపతి చర్చలు జరపనున్నారు. భారత్-సెనెగల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు 60 ఏళ్లు పూర్తవుతుండడంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ కూడా భారతీయ సంతతివారితోపాటు మన వ్యాపారవేత్తలతో సంభాషించనున్నారు. జూన్ 4 నుంచి 7 వరకు జరగనున్న కతార్ పర్యటనలో భాగంగా కతార్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్లా బిన్ హమాద్ అల్ థానీ తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం కతార్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని పలువురు కతార్ ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలతో సంభాషిస్తారు. పర్యటన ముగింపునకు ముందు కతార్ లోని భారతీయ సంతతి ప్రజలతో ఉపరాష్ట్రపతి మాట్లాడతారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement