Tuesday, November 26, 2024

Delhi | అక్కడ తగలబడుతుంటే ఇక్కడ రాజకీయాలా? ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై వీహెచ్ ఫైర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెగల మధ్య ఘర్షణతో మణిపూర్ రాష్ట్రం తగలబడిపోతుంటే పట్టించుకోకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయ సభల్లో బిజీ అయ్యారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు ఆరోపించారు ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రధాని తెలంగాణ పర్యటనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ, మణిపూర్‌లో ఇంత హింస జరుగుతున్నా సరే రాష్ట్రపతి పాలన విధించడం లేదని, అక్కడున్నది బీజేపీ ప్రభుత్వం కావడమే అందుకు కారణమని వీహెచ్ అన్నారు.

మహిళా బిల్లు తెచ్చామని, మహిళలకు రాజ్యాధికారం కల్పిస్తున్నామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం మణిపూర్‌లో మహిళలకు కనీసం రక్షణ కల్పించలేకపోతోందని విమర్శించారు. అక్కడి హింసలో మహిళలు, చిన్నారులు బలిపశువులుగా మారుతున్నారని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట పెంచుతున్నామని చెబుతూ.. మణిపూర్ హింసను అదుపులో చేయడంలో విఫలమవుతున్నారని నిందించారు.

- Advertisement -

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పోస్టర్లు, ఫ్లెక్సీల విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని వీహెచ్ తప్పుబట్టారు. నిబంధనలు అమలు చేస్తే అందరికీ ఒకేలా అమలు చేయాలని, ప్రతిపక్షాలు పోస్టర్లు పెడితే చింపేయడం, అధికార పార్టీ బర్త్ డే వేడుకలకు సైతం నగరాన్ని పోస్టర్లతో ముంచెత్తినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం జరుగుతోందని అన్నారు.

పడిగాపులు నిజమే.. కానీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ టికెట్లు కేటాయించాలన్న డిమాండ్‌తో గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన టీ-కాంగ్రెస్ బీసీ నేతల గురించి ప్రశ్నించగా.. అధిష్టానం పెద్దల అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాసిన మాట నిజమేనని అంగీకరించారు. అయితే తమలో కొందరితో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే చర్చలు జరిపారని, ఆ చర్చల తర్వాత బీసీలకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరగదన్న నమ్మకం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. తాను కూడా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశానని చెప్పారు.

రాష్ట్ర జనాభాలో 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కనీసం 3 సీట్లైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)లో చేసిన తీర్మానం ప్రకారం కనీసం రెండు చొప్పున మొత్తం 34 సీట్లయినా ఇచ్చేలా అధిష్టానం జాగ్రత్తలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ నేతలంగా గుంపుగా వచ్చి కలవడానికి అధిష్టానం ఒప్పుకోలేదని, కానీ విడివిడిగా వీలునుబట్టి కొందరికి అపాయింట్మెంట్లు ఇచ్చిందని తెలిపారు.

ఖర్గేను మధుయాష్కి సహా మరికొందరు నేతలు కలిశారని, వారితో చెప్పిన ప్రకారం బీసీలకు అన్యాయం జరగనీయమంటూ ఖర్గే హామీ ఇచ్చారని తెలిపారు. షాద్‌నగర్‍‌‌లో తలపెట్టిన కాంగ్రెస్ బీసీ గర్జన సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా హాజరవుతారని వీహెచ్ తెలిపారు. ఈ సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement