Friday, November 22, 2024

భారత్‌కు వీటో ఇవ్వాలి.. ఐరాసలో శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్‌ మద్దతు

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించాలని, విస్తరణలో భారత్‌కు తప్పకుండా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని పలుదేశాలు డిమాండ్‌ చేశాయి. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు గళమెత్తాయి. సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంటుంది. శాశ్వత సభ్యత్వాన్ని అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌, చైనా, రష్యాలు కలిగి ఉన్నాయి. భద్రతా మండలిలో సభ్యత్వాలను పెంచడం, ప్రపంచవ్యాప్తంగా సమాన ప్రాతినిధ్యం అందించడం, ఇతర కీలక విషయాలపై ఐరాస సాధారణ సమావేశంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రాన్స్‌ డిప్యూటీ పర్మనెంట్‌ రిప్రెజెంటేటివ్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ నతాలీ బ్రాడ్‌ హరస్ట్‌ శనివారం మాట్లాడారు.

‘ఫ్రాన్స్‌ వైఖరి స్థిరమైనది, అందరికీ తెలిసినదే. నేటి ప్రపంచానికి అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని అందించేలా, ఐరాస అధికారం, దాని పనితీరు మరింత మెరుగుపరిచేలా నిర్ణయాలు తీసుకోవాలి’ అని అన్నారు. ప్రపంచంలో కొత్త శక్తుల అవతరణ, సెక్యూరిటీ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యత్వం కోసం తహతహలాడుతున్న దేశాలను చూడాల్సి ఉన్నదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితల రీత్యా మండలి సభ్యుల సంఖ్యను 25 కు పెంచడం ఉత్తమం అని చెప్పారు. ఈ శాశ్వత మండలిలో జర్మనీ, బ్రెజిల్‌, ఇండియా, జపాన్‌లకు అవకాశం ఇవ్వాలని తాము కోరుతున్నట్టు ఫ్రాన్స్‌ పేర్కొన్నారు. అంతేకాదు, ఇందులో ఆఫ్రికా దేశాలూ ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఇక వీటో అనేది చాలా సున్నితమైన విషయం అని, అది శాశ్వత సభ్యత్వం ఆశిస్తున్న దేశాలది వివరించారు. సామాజిక ఊచకోత లేదా ఇతర నరమేధాలు జరుగుతున్నప్పుడు వీటో అధికారాన్ని స్వచ్ఛందంగా వదులుకోవాలని కోరారు. 15 దేశాల భద్రతా మండలిలో యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌, రష్యాలు భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి మద్దతు తెలిపాయి. ఒక్క చైనా మాత్రమే మద్దతు తెలుపాల్సి ఉన్నది. భారత్‌ ప్రస్తుతం తాత్కాలిక సభ్యదేశంగా ఉన్నది. ఈ రెండేళ్ల తాత్కాలిక సభ్యత్వం కూడా వచ్చే నెలతో ముగియనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement