Saturday, November 23, 2024

ఢిల్లీలో వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతిలో మాదిరిగానే దేశ రాజధాని ఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోనూ వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మందిర్ మార్గ్‌లోని శ్రీ బాలాజీ ఆలయంలో గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన టీటీడీ స్థానిక సలహామండలి ఛైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో జరిగే ప్రత్యేక పూజలు, కైంకర్యాలు, కార్యక్రమాలను ఇక్కడి ఆలయంలోనూ నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. అనంతరం ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ…. ఢిల్లీలో కన్నులపండువగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో దక్షిణాది వారితో పాటు ఉత్తరాది భక్తులూ పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈనెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా మృత్సంగ్రహణం, రక్షాబంధనం, పుణ్యవచనం, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజల్లో కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.

12 రోజులు వైభవంగా దేవదేవుడి బ్రహ్మోత్సవాలు

12వ తేదీన అంకురార్పణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 22న పుష్పయాగంతో ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. రెండో రోజు 13వ తేదీ ఉదయం గం. 8.30 నుంచి 9.00 మధ్య ధ్వజారోహణం, సాయంత్రం గం. 7.30 నుంచి 8.30 మధ్య పెద్దశేషవాహనం సేవలు నిర్వహిస్తారు. 14వ తేదీ ఉదయం చిన్నశేషవాహనం, సాయంత్రం హంసవాహనం మీద స్వామి వారిని ఊరేగించనున్నారు. 15వ తేదీన ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యాల పందిరి వాహనం, 16 ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలుంటాయి. 17వ తేదీ ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గం. 5.00 నుంచి గం. 7.00 వరకు కళ్యాణోత్సవం, గం. 7.30 నుంచి 8.30 వరకు గరుడ వాహనం సేవలు నిర్వహిస్తారు. 18వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహనం, 19వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలు జరుపుతారు. 20వ తేదీ ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వ వాహనం, 21 ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమాలను నిర్వహిస్తారు. చివరి రోజైన 22న సాయంత్రం గం. 6.00 నుంచి 8.00 వరకు పుష్పయాగం జరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement