న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వివాదాలతో తరచుగా వార్తల్లో ఉండే కోమటిరెడ్డి వెంకట రెడ్డి బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. అరగంటకు పైగా ఆయనతో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితుల గురించి చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం తీరుపై ఖర్గేకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కారణంగా అనేక మంది సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవ రెడ్డి వంటి తొలి తరం కాంగ్రెస్ నేతల కుటుంబాల నుంచే నేతలు పార్టీ వీడి వెళ్లిపోయారని మర్రి చెన్నారెడ్డి, వెంకటరామ్ రెడ్డి ఉదంతాలను గుర్తుచేశారు. పార్టీలోని అనేక మంది సీనియర్ నేతలు రాష్ట్ర నాయకత్వం తీరుతో విసిగిపోయారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా చాలా మంది పార్టీ వీడి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఖర్గేతో చెప్పినట్టు తెలిసింది. తాజాగా టీపీసీసీ కార్యవర్గం కూర్పు అనంతరం పలువురు సీనియర్ నేతలు సైతం రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేసిన ఉదంతాలను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
ఏఐసీసీ దూతగా పార్టీలో నేతల మధ్య సమన్వయం సాధిస్తూ అందరినీ కలుపుకోవాల్సిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ సైతం రేవంత్ రెడ్డి చెప్పుచేతల్లోనే పనిచేస్తున్నారని వెంకటరెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఇద్దరి కారణంగా రాష్ట్రంలో పార్టీ నానాటికీ బలహీనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గేతో భేటీ అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సన్నిహితులతో మాట్లాడుతూ ఖర్గే తన అభిప్రాయంతో ఏకీభవించారని చెప్పినట్టుగా తెలిసింది. ముప్పై ఏళ్లుగా పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ మంత్రి పదవులను సైతం త్యాగం చేసిన అంశాన్ని ఖర్గే గుర్తుంచుకున్నారని, సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడి వెళ్లిపోయినా సరే తాను మాత్రం పార్టీని వీడకుండా ఉన్నందుకు అభినందించారని తెలిసింది. తాజాగా ప్రకటించిన టీపీసీసీ కార్యవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు కల్పించనప్పటికీ, జాతీయస్థాయిలో ఆయన సేవలను వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోందని ఖర్గే చెప్పినట్టుగా తెలిసింది. త్వరలో ఏఐసీసీ స్థాయిలో జరిపే మార్పులు చేర్పుల్లో తనకు అవకాశం కల్పిస్తానని ఖర్గే చెప్పినట్టుగా వెంకటరెడ్డి సన్నిహితులకు చెప్పారు.