Tuesday, November 26, 2024

Delhi | సభను అడ్డుకుంటే ప్రభుత్వానికే లాభం.. ప్రతిపక్షాలది తప్పుడు వ్యూహం : వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంటును ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల ప్రభుత్వానికే ప్రయోజనం కల్గుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలుగు మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడారు. సభను అడ్డుకోవడం ప్రతిపక్షాల తప్పుడు వ్యూహంగా ఆయన అభివర్ణించారు. సభను ఇన్ని రోజులు అడ్డుకోవడం ఏమాత్రం సమంజసం కాదని, పైపెచ్చు చట్టసభల్లో మాట్లాడే అవకాశాన్ని తమంతట తాముగా వదులుకుంటున్నారని అన్నారు. పార్లమెంట్ వెలుపల ఎంత మాట్లాడినా.. సభ లోపల మాట్లాడేవి రికార్డుల్లో ఉంటాయని, తద్వారా వారు చెప్పదల్చుకున్నది దేశ ప్రజలకు చేరుతుందని అన్నారు.

గందరగోళం మధ్య బిల్లులు పాస్ చేయడంపై కూడా ఆయన స్పందించారు. సభ సజావుగా సాగనిస్తే బిల్లులపై చర్చ జరుగుతుందని, గందరగోళం వారే సృష్టించి.. ఆపై గందరగోళం మధ్యనే బిల్లులు పాస్ చేస్తున్నారనడం సరికాదని హితవు పలికారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ పెండింగులో ఉండగా బిల్లులు పాస్ చేయడం గురించి కొందరు విలేకరులు ప్రస్తావించగా.. అవిశ్వాసంపై ముందు విపక్షాలకు విశ్వాసం ఉందా అని ప్రశ్నించారు. అది ఎలాగూ వీగిపోయే తీర్మానమేనని, అలాంటప్పుడు బిల్లులపై రాద్ధాంతం సరికాదన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement