న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రధాన మంత్రి మాటల మాంత్రికుడిగా అభివర్ణించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వీడ్కోలు పలుకుతూ ఆయన ప్రయోగించే పదజాలం, ఏక వాక్య ప్రయోగాలు, ప్రేరణాత్మక వాక్య ప్రయోగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమేనని అన్నారు. భారతదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సమయంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి స్వాతంత్ర్య భారతంలో పుట్టినవారు కావడం, వారంతా సామాన్య కుటుంబాల నుంచి రావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగాలు, మాట్లాడిన ప్రతి మాట యువతను, మహిళలను, సమాజంలోని పీడిత, తాడిత వర్గాలకు ఎంతగానో ప్రేరణనిచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ ఐదేళ్లలో ఆయన చేసిన ప్రసంగాల్లో సింహభాగం యువతను, యువ శక్తిని ఉద్దేశించి చేయడం ప్రేరణాత్మకమని కొనియాడారు.
వెంకయ్య నాయుడు మార్గదర్శనంలో పనిచేసే అవకాశం తనకు దక్కిందని, అలాగే ఆయనతో సన్నిహితంగా కలిసి పనిచేసే అవకాశం కూడా తనకు దక్కినందుకు గర్వపడుతున్నానని అన్నారు. దేశం పట్ల వెంకయ్య నాయుడుకు ఉన్న ప్రేమ, గౌరవాభిమానాలకు కృతజ్ఞుడినని తెలిపారు. పార్టీ, ప్రభుత్వం ఏ బాధ్యతను అప్పగించినా వాటిని ఎంతో చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వహించి.. తనలాంటి కార్యకర్తలందరికీ మార్గదర్శకంగా నిలిచారని వెల్లడించారు. మాతృభాష పట్ల వెంకయ్య నాయుడు అభిరుచి అభినందనీయం, ఆదర్శనీయమని, దాదాపుగా మీరు మాట్లాడిన ప్రతి సందర్భంలో మాతృభాషను కాపాడుకోవడం గురించే చెప్పేవారని ప్రధాని గుర్తుచేశారు. విద్యార్థి నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించి, జీవితంలో సాధించిన మైలురాళ్లు చాలా ప్రత్యేకమైనవని, రాజకీయంగా కూడా వెంకయ్య నాయుడు జీవనం పారదర్శకంగా సాగిందని ప్రశంసించారు. ఎన్నో విలువలను నిజజీవితంలో అమలుచేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రధాని కొనియాడారు.
వెంకయ్య నాయుడు హయాంలో రాజ్యసభ పనితీరు ఎంతగానో మెరుగుపడిందని అన్నారు. సభ్యుల హాజరు గణనీయంగా పెరిగిందని, ఆయన మార్గదర్శనంలో ఎన్నో బిల్లులు విజయవంతంగా ఆమోదం పొందాయని తెలిపారు. అంతే కాదు, రాజ్యసభ సచివాలయంలో కాగిత రహిత వ్యవస్థను ప్రోత్సహించడం వంటి ఎన్నో కార్యక్రమాలకు బీజం వేశారని గుర్తుచేశారు. సభాకార్యక్రమాల విషయంలో, సభలో సభ్యుల ప్రవర్తన, బాధ్యత తదితర విషయాల్లో తన అనుభవాలను చెబుతూ.. ప్రేమగా హెచ్చరించినా.. మొట్టికాయలు వేసినా.. మార్గదర్శనం చేసినా అది ఆయనకే చెల్లిందని ప్రధాని వ్యాఖ్యానించారు. చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం అనే ఆయన దృక్పథం అందరికీ స్ఫూర్తిదాయకమని మోదీ అన్నారు.
అన్ని పార్టీల ఎంపీలకు సరైన అవకాశాలిస్తూ.. వారి అనుభవం సభకు ఎలా అవసరమో నిరంతరం చెబుతూ వచ్చారని గుర్తుచేశారు. వీడ్కోలు కార్యక్రమంలో ఇంతమంది సభకు హాజరవడం ఆయనపై అందరికీ ఉన్న గౌరవానికి సంకేతమని మోదీ అన్నారు. ఆయన చూపిన బాట.. అనుసరించిన విధానాలు.. ఈ స్థానంలో కూర్చునేవారికి మార్గదర్శనం చేస్తాయని వ్యాఖ్యానించారు. దేశం కోసం, పార్లమెంటరీ వ్యవస్థకోసం వెంకయ్య నాయుడు చేసిన కృషికి, మార్గదర్శనానికి ప్రధానమంత్రిగా, పార్లమెంటు సభ్యులందరి తరపున ధన్యవాదాలు చెబుతున్నానని మోదీ తెలిపారు.