యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున భారీగా వాహనాల రద్దీ పెరిగింది. అంతేకాకుండా వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడంతో సోమవారం ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం నుంచి ఓటర్లు సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. దీంతో శని, ఆదివారాల్లో ఒక్కసారిగా వాహనాలు రావడంతో టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీంతో అప్రమత్తమైన టోల్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర వాసులు బయలు దేరారు. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయణమవుతున్నారు.
ప్రజా స్వామ్యంలో ఓటు కీలకమైంది. ప్రతి ఓటు విలువైనది. ఒక్క ఓటుతో తలరాతలు సైతం మారుతుంటాయి. అలాంటి వజ్రాయుధం లాంటి ఓటు వేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని భావిస్తున్నారు.. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ఓటర్లు. జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్ల పండుగకు వెళ్తుండటంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అయినా.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.