Friday, November 22, 2024

Air India: శాకాహార భోజ‌నంలో మాంసహారం…ఫిర్యాదు చేసినా పట్టించుకోని విమానయాన సంస్థ

ఎయిర్ ఇండియా విమానంలో మహిళకు చేదు అనుభవం ఎదురైంది. శాకాహార భోజనం అడిగిన ఆమెకు విమాన సిబ్బంది అదే ఇచ్చినా.. అందులో చికెన్ ముక్కలు ఉండడంతో ఆమె అవాక్కైంది. అంతేకాదు, వారు సర్వ్ చేసిన ఆహార పొట్లంపై ‘వెజ్ మీల్’ అని స్పష్టంగా రాసివుంది కూడా. దీంతో మహిళా ప్రయాణికురాలు వీరాజైన్ వెంటనే ఆ ఫొటోలు తీసి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో షేర్ చేసింది.

తాను అందుకున్న ఆహారంపై జైన్ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం తనకు ఆవేదన కలిగించిందని ఆమె పేర్కొన్నారు. వెజ్ మీల్స్‌‌లో నాన్‌వెజ్ ముక్కలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఇతర ప్రయాణికులను అప్రమత్తం చేయలేదని తెలిపారు. దీనికి తోడు విమానం గంట ఆలస్యం కావడం, ఈ కారణంగా తాను వెళ్లాల్సిన రైలు మిస్ కావడంతో ఆమె తన మొత్తం అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ డీజీసీఏ, విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా‌ను ట్యాగ్ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆమె పోస్టు వైరల్ అయి చర్చనీయాంశం కావడంతో స్పందించిన ఎయిర్ ఇండియా.. ఆ పోస్టును డిలీట్ చేయాలని, ఇలాంటి సున్నిత విషయాలను బహిరంగ పర్చవద్దని కోరింది. పీఎన్ఆర్ నంబర్‌తో తమకు నేరుగా మెసేజ్ (డీఎం) చేయాలని అభ్యర్థించింది.

ఎయిర్ ఇండియా కోరినట్టే డైరెక్ట్ మెసేజ్ చేసినప్పటికీ వారి స్పందన చాలా నాసిరకంగా ఉందని జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కేవలం క్షమాపణలు చెప్పి ఆ విషయాన్ని అక్కడితో ముగించారని పేర్కొన్నారు. సెంటిమెంట్లను గాయపరిచిన విషయాన్ని వారు అంత తేలిగ్గా తీసుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ విషయంలో ఎయిర్‌ ఇండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపైన అయినా ఎయిర్ ఇండియా ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, నాణ్యతా ప్రమాణాలను పెంచాలంటూ నెటిజన్లు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement