Friday, November 22, 2024

Delhi | వీరశైవ లింగాయత్‌లలో 90 శాతం నిరుపేదలే.. జాతీయ ఓబీసీ జాబితాలో తక్షణమే చేర్చాలి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వీరశైవ లింగాయత్, లింగ బలిజల సామాజికవర్గాలను వెంటనే కేంద్ర ప్రభుత్వ వెనుకబడిన వర్గాల (ఓబీసీ) జాబితాలో చేర్చాలని లింగాయత్ సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ఈ ధర్నాకు బీసీ సంక్షేమ సంఘంతో పాటు పార్టీలకు అతీతంగా పలువురు పార్లమెంట్ సభ్యులు హాజరై సంఘీభావం తెలిపారు.

ధర్నాలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, బీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీలు సురేష్ షెట్కార్, పొన్నం ప్రభాకర్, రాపోలు ఆనంద భాస్కర్ పాల్గొని లింగాయత్ సమాజం డిమాండ్‌కు మద్దతు పలికారు. చాలా కాలంగా జాతీయ ఓబీసీ జాబితాలో వీరశైవ లింగాయత్, లింగ బలిజ వర్గాలకు చేర్చాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -

ధర్నా సందర్భంగా మీడియాతో మాట్లాడిన వీరశైవ లింగాయత్ సమాజం తెలంగాణ అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కర్ణాటక ఎన్నికల్లో లింగాయత్‌లు ఇచ్చిన పిలుపు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తలరాతను మార్చేసిందని గుర్తుచేశారు. వీర శైవ లింగాయత్‌లలో 90 శాతం నిరుపేదలేనని, ఈ పరిస్థితుల్లో 2009లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ వర్గాలను బీసీల జాబితాలో చేర్చిందని తెలిపారు. కానీ కేంద్ర జాబితాలో చేర్చకపోవడం వల్ల గత 14 ఏళ్లుగా తమ పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

14 ఏళ్లుగా జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నామని, అనేక పర్యాయాలు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) సహా కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశామని అన్నారు. ఇప్పటికీ ఈ అంశం పెండింగులోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర జాబితాలో చేర్చకపోవడం వల్ల జాతీయ స్థాయిలో విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని తెలిపారు.

ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ అడ్మిషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కోల్పోతున్నామని చెప్పారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయని, ఈ లోగా తమ డిమాండ్ నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో లింగాయత్‌ల సత్తా ఏంటో ఎన్నికల్లోనే ఓటు ద్వారా చూపిస్తామని హెచ్చరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement